లింగాలఘనపురం; డిసెంబర్ 25 : ప్రధాని నరేంద్రమోదీ రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మన్‌కీబాత్ కార్యక్రమం వెలవెలబోయింది. రైతులకు బదులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో కాషాయ పార్టీ సభను తలపించింది. వివరాల్లోకి వెళ్తే.. దేశంలోని 13 రాష్ర్టాల్లో ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ జిల్లా లింగాలఘనపురాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా డిజిటల్ వాల్ స్క్రీన్ అమర్చారు. వివిధ గ్రామాల నుంచి కనీసం వంద మంది రైతులనైనా ఈ కార్యక్రమానికి తరలించాలని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు నిర్దేశించుకున్నారు. నాలుగు రోజుల ఉంచి విస్తృతంగా మన్‌కీబాత్‌పై ప్రచారం చేశారు.
ఆరునూరైనా సరే.. రైతాంగాన్ని తరలించి ప్రధాని మెప్పు పొందాలనుకున్నారు. ఈ క్రమంలో లింగాలఘనపురంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వేలాది రూపాయలు ఖర్చు చేసి భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. అయితే మన్‌కీబాత్ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు మాత్రమే రాగా, కనీ సం 10 మంది రైతులైనా కనిపించలేదు. దీం తో ఇదేమి మన్‌కీబాత్ అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఇదిలా ఉండగా దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ విగ్రహావిష్కరణకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మందీ మార్బలంతో వచ్చారు. మన్‌కీబాత్ వేదిక కిలోమీటరు దూరంలో దీనిని ఏర్పాటు చేశారు. రైతులు లేకపోవడంతో ఈటల రాజేందర్‌ను మన్‌కీబాత్ వేదిక వద్దకు నిర్వాహకులు తీసుకొచ్చారు. దీంతో వేదికంతా బీజేపీ శ్రేణులతో నిండిపోయింది. మండల కేంద్రంలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన నాయకులు తిరిగి మన్‌కీబాత్ వేదికకు అమర్చిన బ్యానర్‌ను తొలగించారు. వాజ్‌పేయి విగ్రహావిష్కరణ బ్యానరును ఏర్పాటు చేసి సంతృప్తి పడ్డారు. మొత్తంగా ప్రధాని మోదీ మన్‌కీబాత్ కార్యక్రమం బీజేపీ సభలా మారడంతో రైతులకు ఒరిగిందేమీ లేదని పలువురు వ్యాఖ్యానించారు.