ఐనవోలు, జనవరి 12 : ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామి వారికి ఒగ్గుపూజారులు మేలుకొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాతఃకాలంలో విఘ్నేశ్వరపూజ, రుద్రాభిషేకం నూతన వస్ర్తాలంకరణ చేశారు. ఉదయం గణపతి పూజ, శైవశుద్ధి పుణ్యాహవాచనం నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభసూచికగా కాషాయ ధ్వజ పతాకాలను చేతపట్టి మంగళవాయిద్యాలతో ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో మూడుసార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
ఆలయ శిఖరం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి గుడిపై జెండా ఎగురవేశారు. అనంతరం మహాన్యాపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, వేద పండితులు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్‌జోషి, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్‌శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, అర్చకులు నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్‌శర్మ, నందనం భానుప్రసాద్, ఉప్పుల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.
నేడు భోగి పూజలు
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామి వారికి ప్రాతఃకాల మేల్కొల్పుతో పూజలు ప్రారంభమవుతాయి. స్వామివారి దర్శనం 24 గంటల పాటు కొనసాగనుంది. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్వామి వారిని దర్శించుకోనున్నట్లు ఎంపీపీ మార్నేని మధుమతి తెలిపారు.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పంచాయతీ రాజ్ శాఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది, ఆరోగ్య శాఖ, మిషన్ భగరీథ, ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆలయం పడమర వైపు 45 వసతి గృహాల నిర్మాణ కోసం ఈవో దాతల సహకారం కోరారు. దీంతో కొంత మంది దాతలు ముందుకు వచ్చి మల్లన్న సదన్‌లో మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టారు. అందులో 8 వసతి గదులు ఇటీవల ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించగా జాతరకు అందుబాటులోకి వచ్చాయి.
దాతల సహకారంతో నిత్యాన్నదాన సత్రం కూడా అందుబాటులో వచ్చింది. 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, 350 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. డీపీవో జగదీశ్వర్ పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, జీపీ పారిశుధ్య సిబ్బంది 174 మంది, వరంగ ల్ మహానగర పాలక సంస్థ నుంచి 100 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.