తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న లేబర్ కార్యాలయం అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం తరచూ మూసి ఉండటం, అధికారుల స్పందన లేకపోవడం వల్ల లేబర్ కార్డుల కోసం తిరుగుతున్న తమకు న్యాయం జరుగడంలేదని వారు వాపోయారు. కార్మికులు చెబుతున్న మేరకు కార్యాలయంలో పనిచేస్తున్న ఏఎల్ఓ (అసిస్టెంట్ లేబర్ అధికారి) స్వచ్ఛందంగా వచ్చిన కార్మికులకు లేబర్ కార్డులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
గత పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వెళ్లిన తమకు అధికారులు అందుబాటులో లేక ఖాళీ కుర్చీలు తప్ప ఏమీ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మీసేవ ద్వారా రూ.110కి లేబర్ కార్డు పొందవచ్చునని తెలిసినా, కార్యాలయం ద్వారా తీసుకోవాలంటే రూ.500 నుండి రూ.800 వరకు ఖర్చవుతోందని, ఇది అధికారుల అవినీతి చర్యలుగా భావిస్తున్నామన్నారు.
కాగా, ఈ విషయంపై అసిస్టెంట్ లేబర్ అధికారి రవి మాట్లాడుతూ..తాను కార్యాలయాన్ని ఉదయం 9:30 కు ఓపెన్ చేశాను. కానీ, పోలీస్ స్టేషన్లో సీఐ దగ్గరికి వెళ్లి లేబర్ కేసు ఒకటి ఉంటే దాని గురించి మాట్లాడి వచ్చానని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు తీర్చడానికి నేను ఒక్కడినే ఉన్నాను. సిబ్బంది కొరతపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నాం. గత కొన్ని నెలలుగా ఈ సమస్యపై అనేక సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, కమిషనర్, సిఈఓ లకు ఫిర్యాదులు చేశాం. అధికారులకు నివేదికలు పంపినప్పటికి సిబ్బంది నియామకం గురించి ఎటువంటి స్పందన లేదన్నారు. అదేవిధంగా లేబర్ కార్డుల కోసం అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఘటనలపై దృష్టి సారిస్తామన్నారు.