కరీమాబాద్, ఏప్రిల్ 22 : వరంగల్ జిల్లా కేంద్రం పరిధిలోని శివనగర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. మామునూరు పోలీసుల కథనం ప్రకారం.. శివనగర్ ప్రాంతానికి చెందిన అడ్డగట్ట కనకయ్య(57) మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం ఈత కొట్టేందుకు జక్కలొద్దిలోని దామెర చెరువుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అదే రోజు కుటుంబసభ్యులు, బంధువులు చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ అతడి బట్టలు, ద్విచక్ర వాహనం కనబడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు చెరువులో వెతికారు.
శుక్రవారం ఉదయం చెరువులో అడ్డగట్ల కనకయ్య మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. పోస్టుమార్టమ్ కోసం మృతదేహాన్ని ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.