కాశీబుగ్గ, జూన్ 23: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఎంజీఎం దవాఖానలో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని, మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఎమర్జెన్సీ మినహా.. అన్ని వైద్య సేవలకు తాము దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశారు. తమకు సకాలంలో ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సరిపడా సిబ్బంది, వైద్య పరికరాలు, భవనాలు, సదుపాయాలు లేవని, వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేఎంసీలో అంతర్గత రోడ్లు ప్రమాదకరంగా మారాయని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అలాగే, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.