పెద్దవంగర/తొర్రూరు/పాలకుర్తి, డిసెంబర్ 12 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగం గా ఆయన తొర్రూరు మండలం అమ్మాపురం, అమర్‌సింగ్ తండా, పెద్దవంగర మండలంలోని పోచంపల్లి, అవుతాపురంతోపాటు పలు గ్రామాలు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం నారబోయినగూడెం, వావిలాల, హఠ్యాతండా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అమలు సాధ్యంకాని ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోస పోయారని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినైట్లెనా లేదన్నారు. రెండేళ్లలో పాలకుర్తి నియోజక వర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఐకేపీలో రూ.450కోట్లు అప్పు తీసుకొని మహిళా సంఘా ల ఖాతా నుంచి డబ్బులు కట్ చేసి.., మీ డబ్బులతోనే మీకు చీరలు ఇస్తున్న గొప్ప ప్రభుత్వం ఇదని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు విసుగుతో ఉన్నారని అన్నారు.
బతుకమ్మ చీరెలను నిలిపివేసి ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పేరుతో కేవలం మహిళా సంఘాలకు మా త్రమే చీరలు పంపిణీ చేయడం విచారకరమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పూర్తిగా మోసమన్నారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, మళ్లీ తాను ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రినవడం ఖాయమన్నారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యాన్ని కోల్పోవద్దని, కష్టకాలంలో మన వెంట నిలిచిన వారికి అండగా ఉంటామన్నారు.
ఆయా కార్యక్రమాల్లో తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నల్లమాస ప్రమోద్ కుమార్, పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్దవంగరలో మాజీ జడ్పీటీసీ కమలాకర్, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, మండల మాజీ అధ్యక్షుడు సోమనర్సింహారెడ్డి, పాలకుర్తిలో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. కాగా, పాలకుర్తి, వావిలాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకూబ్‌రెడ్డి, కాంగ్రెస్ వావిలాల గ్రామ యూత్ అధ్యక్షుడు శీల లింగయ్యతో పాటు పది మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.