ఎండుతున్న పైరును చూసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చెరువులు, చెక్‌డ్యాంల్లో నీరు లేకపోవడంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో చుక్క నీరు రావడం లేదు. దేవాదుల నీరే ప్రధాన వనరుగా ఉన్నా, కాంగ్రెస్ సర్కారు కాల్వల్లో నేటికీ చుక్క నీరు విడుదల చేయకపోవడంతో పొట్టకొచ్చిన వరి చేన్లు ఎండిపోతున్నాయి. సగానికి సగం వరి చేన్లు జీవాలకు మేతగా మారుతున్నాయి. చేతికి రావాల్సిన పంట ఇలా పనికి రాకుండా పోవడంతో అన్నదాత గుండె పలిగి రోదిస్తున్నాడు.
– దేవరుప్పుల, మార్చి 3
యాసంగి ఆరంభంలో భూగర్భ జలాలు సంతృప్తికరంగా ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు ఏటా నవాబుపేట, స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ల నుంచి దేవాదుల నీరు కాల్వల ద్వారా వదులుతుండడంతో అదే భరోసాతో ఉన్నారు. మార్చి నాటికి కూడా కాల్వలు వదలకపోవడంతో చెరువులు, వాగులు ఎండి భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. మండలంలో ప్రధాన నీటి వనరులైన సింగరాజుపల్లి సింగరాయ చెరువు, వాగుపై ఉన్న 9 చెక్‌డ్యామ్‌లు, కడవెండి తాళ్ల చెరువు, మాధాపురం గరిక చెరువు, దేవరుప్పుల గుడి చెరువు, చినమడూరు, పెదమడూరు, నీర్మాల చెరువుల్లో నీరు లేకపోవడం ఈ దుస్ధితికి కారణమని రైతులు అంటు న్నారు.
దీంతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లలో నీళ్లు బందయ్యాయి. ఇప్పటికే పంట పొలాలు దాదాపుగా ఎండగా రైతులు పశువులను మేపుతున్నారు. కొందరు గొర్రెలు మేపుకోవడానికి కాపరులకు అమ్ముకుంటున్నారు. మరి కొందరు గడ్డి కోసి పసుల మేతకు నిల్వ చేసుకుంటున్నారు. చేతికి రావాల్సిన పంట ఇలా ఎండు తుండడంతో రైతు కుటుంబాలు దిగులు పడుతున్నాయి. కొందరు రైతులు తమ బిడ్డలు పెండ్లిళ్ల కు ఉన్నారని, మరికొందరు అప్పులు తెచ్చి నాట్లు వేశామని కన్నీరు పెడుతున్నారు. నీటి కరువు తీర్చడానికి ప్రధాన వనరైన దేవాదుల నీరు తెప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి విఫలం కావడంతోనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు చెప్పుకుంటున్నారు.
నోటికాడి బుక్క మట్టిల పడ్డట్టుంది
యాసంగి దినం 8 ఎకరాలు నాటు పెడితే ఏడెకరా లు ఎండింది. మూడు బోర్లు పోస్తలేవు. ఎకరానికి రూ. 20 వేల పెట్టుబడి పెట్టినం. కొంత పొలం ఈనింది. కొంత పొలం పొట్టకుంది. నోటి కాడి బుక్క మట్టిల పడ్డట్టుంది. పొలం అంతా ఎండుతున్నది. సింగరా య చెరువుల నీళ్లుం టే మాబోర్లు పోసేది. ఇది పదేండ్ల సంది ఎప్పుడు ఎండలే. అదే నమ్మకంతో నాట్లు పెట్టినం. దేవాదుల కాల్వలు వదలకపోవడంతోనే చెరువుల నీళ్లు లేకుండ పోయినయి. ఇద్దరు బిడ్డలు పెం డ్లిళ్లకున్నరు. ఈ పంటతో బిడ్డ పెండ్లి చేయొచ్చని కలలు కన్నం. పొ లం ఎండడంతో రందిప డుతున్నం. నా మొగడు లింగా రంది తో ఆగమాగం చేస్తే దవాఖానకు తీసుకుపోయిన. డాక్టర్ గుం డెపోటు వచ్చిందన్నడు. ఏదో బాధతోని ఉన్నడన్నడు. అప్పటి నుంచి పొలంకాడికి రానిస్తలే ను. నేనే చూ సుకుంటున్న. పంటంత ఎండేటట్లున్నది. పసుల మేపుతున్నం.
– కున్సోత్ సరిత, రైతు, పచ్చర్లబాయి తండా