వెంకటాపురం (నూగూరు) జనవరి 6 : డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో టూరిస్టు బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని అంకన్నగుడెం సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కానిపాకం గ్రామపంచాయతీ శివారు ఉత్తరబ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన 45 మంది శక్తి మాలలు ధరించారు. దీక్ష అనంతరం ఇరుముడి అప్పగించేందుకు గురుస్వామితో తమిళనాడులోని మేల్ ముత్తూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏడు రోజుల పాటు బస్సులో తీర్థయాత్రలు వెళ్లేందుకు కానిపాకం నుంచి టూరిస్టు బస్సులో బయలుదేరారు.
ఈ నెల 5న భద్రాచలంలో శ్రీసీతారాముల వారిని దర్శించుకుని అక్కడే నిద్రించారు. శుక్రవారం ఉదయం పర్ణశాల ఆలయాన్ని దర్శించుకొని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించేందుకు వస్తున్నారు. వెంకటాపురం మండలం అంకన్నగూడెం సమీపంలోకి రాగానే డ్రైవర్ దేవ ఇరక్కం(49)కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. అపస్మారక స్థితిలోఉన్న డ్రైవర్‌ను బస్సులో నుంచి దింపి 108 వాహనానికి సమాచారం అందించారు. వెంకటాపురంలోని వైద్యశాలకు బాధితుడిని తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనాస్థలిని పోలీసులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.