ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోరు వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. గుర్తుల కేటాయింపుతో ప్రచారం మొదలుపెట్టా రు. ఇంటింటికీ వెళ్లి దండాలు పెడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం.. అంటూ హామీలు గుప్పిస్తున్నారు. అన్ని కుల, యూత్, మహిళా సంఘాలతో మమేకమవుతూ తమను గెలిపించాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండని వారికి ఫోన్లు చేస్తూ వలస ఓట్లను రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఆరు జిల్లాల్లో 502 సర్పంచ్ స్థానాలకు 1787 మంది, 3850 వార్డులకు 9228 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 53 సర్పంచ్, 1102 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
జనగామ, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ : మొదటి విడత సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో రాజ కీయం ఊపందుకుంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ ప్రధాన పార్టీలు ప్రతిష్టా త్మకంగా తీసుకుంటున్నాయి. పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులకు గుర్తులు కేటా యించడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్‌గా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కుల, యువజన, మహిళా సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. పలు తాయిలాలు ఇస్తూ వారి ని ప్రసన్నం చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు.
ఈనెల 11న జరిగే ఎన్నికల్లో భారీ పోలింగ్ జరిగేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఇతర గ్రామాలు, పట్టణాల్లో ఉంటున్న ఓటర్లు సహా తమ బంధువులు, అనుచరులను గ్రామాలకు రప్పించేందుకు ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలను సమకూర్చి వారి ఓటర్లను రాబట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పో టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మద్ధతుదారులు బరిలో ఉన్నా.. గ్రామాల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొన్నది. ఆయా పార్టీల ముఖ్యనేతలు తమ మద్దతుదా రులై సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.
పొద్దూ.. మాపు.. ఓటర్లకో దండం..
గ్రామాల్లో ఉదయం 9 గంటలు దాటిందంటే జనం వ్యవసాయ పనులు, కూలి పనులకు వెళ్తుంటారు.. దీంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు పొద్దుగాల, మాపటీలి ఇండ్లలోకి వెళ్లి అన్నా.. అక్కా.. వదిన.. బావ.. మామ అంటూ వరుసలు కలిపి దండం పెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వృద్ధులు.. వయస్సులో పెద్దవాళ్ల కాళ్లు మొక్కి.. రెండు చేతులు పట్టుకొని మరీ ప్రాధేయపడుతున్నారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు ఒక విడత.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మరో విడత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
