హనుమకొండ, జూలై 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా పథకం మొదలు కాకముందే ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును మాత్రం గాలికొదిలేసింది. చాలా పథకాల తరహాలోనే ఈ పథకానిదీ అదే తీరు. భూమి లేని వ్యవసాయ కూలీలకు రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పథకం అమలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. హడావుడిగా లబ్ధిదారులను తేల్చినట్లు చేసింది. పథకం నిబంధనలు మార్గదర్శకాలు సరిగా లేకపోవడంతో అర్హుల్లో పది శాతం మందిని సైతం ప్రభుత్వం గర్తించిన లబ్ధిదారులు జాబితాలో లేరు. ఎంపిక చేసిన కొద్దిమందికీ ఆత్మీయ భరోసా చెల్లింపులను సర్కారు ఎగవేస్తున్నది. అంతేగాక చెల్లింపులను ఎప్పటినుంచి మొదలు పెడతారనేది చెప్పడం లేదు.
అర్హులు ఎన్నిసార్లు అడిగినా అధికారుల నుంచి సమాచారం రాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. పథకం ప్రారంభించి ఆరు నెలలు పూర్తయినా అర్హులకు ఇప్పటికీ తొలి విడత మొత్తాన్ని సైతం జమ చేయలేదు. రెండో విడత మొత్తం చెల్లించే గడువు సమీపిస్తున్నా ఈ పథకం గురించి పట్టించుకోవడం లేదు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి, వ్యవసాయ భూమి అస్సలు లేని వారిని ఈ పథకానికి అర్హులని పేర్కొన్నది. కూలీ కుటుంబంలో ఎందరు ఉన్నా ఒక్క మహిళ మాత్రమే అర్హురాలు అని నిబంధన పెట్టింది. సాంకేతికంగా దరఖాస్తు ప్రక్రియ లేకుండానే అర్హులను ప్రకటించింది. ప్రభుత్వం వద్ద ఉన్న ఉపాధి హామీ పథకం కూలీల జాబితా నుంచి అర్హులను గుర్తించినట్లు ప్రకటించింది. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో కలిపి 66,919 మంది ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది.
ప్రతి ఆరు నెలలకోసారి రూ.6 వేల చొప్పున వీరి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. ప్రభుత్వమే తక్కువ మందిని గుర్తించింది. వీరిలోనూ అందరికి కాకుండా ప్రతి మండలంలోని ఒక గ్రామంలోని వారికే చెల్లింపులను జరిపేలా పైలట్ గ్రామాలకు పథకం అని కొత్త కారణాలు చెప్పింది. ఈ ఏడాది జనవరి 26న పైలట్ గ్రామాల్లో అర్హులుగా ప్రకటించిన వారికి తొలి విడతలో భరోసా మొత్తాన్ని చెల్లించింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 2,581 మందికి మాత్రమే పథకం వర్తించింది. మిగతా 64,338 మందికి రూ.38.73 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా తేల్చిన వారికీ ఆరు నెలలుగా ఆత్మీయ భరోసా చెల్లించకుండా ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నది.
Pp