జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు
పేపర్-1లో 91.28, పేపర్-2లో 91.62 శాతం హాజరు
అధికారుల పర్యవేక్షణ మధ్య ముగిసిన పరీక్ష
గిర్మాజీపేట/పోచమ్మమైదాన్, జూన్ 12: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 8,222 మందికి 7,505 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు జిల్లాలోని 32 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 7,325 మందికి 6,711 మంది హాజరైనట్లు డీఈవో వెల్లడించారు. పేపర్-1 పరీక్షలో 91.28, పేపర్-2లో 91.62 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలోని పద్మావతి డిగ్రీ కళాశాల, సీకేఎం కళాశాల, ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రాలను తాను తనిఖీ చేసినట్లు చెప్పారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన టెట్ సెంటర్‌ను కలెక్టర్ బీ గోపి సందర్శించారు. కళాశాలలోని ఏ, బీ సెంటర్లలో టెట్ తీరును అధికారులను అడిగి తెలుసుకొని వారికి సూచనలు అందించారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్ష
నర్సంపేట/నర్సంపేటరూరల్: నర్సంపేట పట్టణవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో టెట్‌ను పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం, సాయంత్రం నిర్వహించిన రెండు పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. మండలంలోని బిట్స్ స్కూల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఏ-సెంటర్, బీ-సెంటర్, నర్సంపేట పట్టణం సర్వాపురంలోని ప్రభుత్వ జూనియర్(బాలికల) కళాశాలలో అభ్యర్థులు టెట్ రాశారు. ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఇన్విజిలేటర్లు అభ్యర్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పలువురు ఇన్విజిలేటర్స్ పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చంటి పిల్లలతో తరలివచ్చారు. తల్లులు పరీక్ష రాస్తున్నంత సేపు పిల్లలను వారి బంధువులు లాలించారు. నిర్వాహకులు పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు చేశారు. బిట్స్ స్కూల్లో 240 మందికి 220 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఏ-సెంటర్లో 240 మందికి 217 మంది, బీ-సెంటర్లో 240 మందికి 212 మంది, సర్వాపురంలోని ప్రభుత్వ జూనియర్(బాలికల) కళాశాలలో 240 మంది అభ్యర్థులకు 223 మంది టెట్ రాశారు. మొత్తం మండలంలోని 4 పరీక్ష కేంద్రాల్లో 88 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు.