నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించగా, కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 99.88శాతం, హనుమకొండ జిల్లాలో 99.87శాతం, మహబూబాబాద్ జిల్లాలో 99.92శాతం, ములుగు జిల్లాలో 99.87శాతం, వరంగల్ జిల్లాలో 99.86శాతం, జనగామ జిల్లాలో 99.97శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.