ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘విదేశీ యువతుల కాళ్లు కడిగించడం దారుణం. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. దీనికి మహిళా లోకం బాధపడుతున్నది. దీని ద్వారా సమాజానికి ఏం సంకేతం ఇచ్చారు?. సంప్రదాయమంటూ వెనకేసుకురావడం సరికాదు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి’ అని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15
ఏటూరునాగారం: ప్రపంచ సుందరీ పోటీదారుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి టవ ల్స్తో తుడిపించడం ఆడపడుచులను అవమానపర్చడమే. అందాల భామల కాళ్లు కడిగి తుడవడం తెలంగాణ సంస్కృతిలో ఎక్కడైనా ఉందా?. ఇంటికి వచ్చిన అతిథికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఇక్కడి ఆనవాయితీ మాత్రమేనని, కాళ్లు కడిగే పద్ధతి ఎక్కడ ఉంది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగింది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను గాలికి వదిలేసి అందాల పోటీలు నిర్వహించడం అవివేకం. తెలంగాణ ఆడపడుచులను అవమానిస్తే ఊరుకునేది లేదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారావు
ములుగురూరల్ : అతిథుల కాళ్లు కడిగే ఆచారం తెలంగాణలో ఎక్కడ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవానికి ఘోరమైన అవమానం చేసింది. వారం రోజుల నుండి రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీదారులు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాల్లో ఒకటైన రామప్ప దేవాలయానికి వారు వచ్చిన క్రమంలో అందగత్తెల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడం దారుణం. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ల వద్ద మన సంప్రదాయాన్ని ప్రభుత్వం తాకట్టు పెట్టింది. కాంగ్రెస్ అంటేనే గ్రేస్ పార్టీ. హిందువుల మనోభావాలను అవమానపర్చమే ప్రభుత్వ పని. విదేశీయుల కాళ్లు కడిగించడం ద్వారా ఈ సమాజానికి ఏం సంకేతం ఇచ్చారు. వెంటనే మహి ళలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో వారితో బుద్ధి చెప్పిస్తాం.
– ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్
జనగామ చౌరస్తా : ప్రపంచ సుందరీమణుల కాళ్లు కడిగించి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం దెబ్బతీశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ బానిసత్వానికి, తెలంగాణ ప్రాంత మహిళలపై వారికున్న విద్వేషపూరిత భావానికి ఇది నిదర్శనం. అందాల పోటీల పేరుతో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
-కత్తుల లక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా జనగామ జిల్లా అధ్యక్షురాలు