మహబూబాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అనేక రకాల పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా నిలిచారు. 2014 నుంచి గిరిజనులకు స్వర్ణయుగం వచ్చింది. పోడు భూములకు పట్టాలు, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6శాతం నుంచి 10శాతం పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. శతాబ్దం నుంచి అపరిష్కృతంగా ఉన్న గిరిజనుల సమస్యలను పరిష్కరించారు.
మా తండాలో మా రాజ్యం..
ఐదు వందల జనాభా ఉన్న అన్ని గిరిజన తండాలు, గోండు గూడేలను గ్రామ పంచాయతీలుగా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 605 తండాలు, గూడేలను జీపీలుగా ఏర్పాటు చేశారు. మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో ఏళ్లుగా పోరాటం చేస్తున్న గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది. అంతే కాకుండా ప్రతి జీపీలో పంచాయతీ భవనానికి రూ.20లక్షలు మంజూరు చేశారు. తండాలకు బీటీ, సీసీ రోడ్లు వేశారు. గిరిజనుల వికాసానికి ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ నుంచి వేలాది కోట్లు వెచ్చిస్తున్నారు.
పది శాతానికి పెరిగిన రిజర్వేషన్..
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల జనాభా శాతానికి అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లను 6శాతం నుంచి పది శాతానికి పెంచారు. దీంతో గిరిజన విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగాయి. గత సంవత్సరం ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు సీట్లు అదనంగా వచ్చాయి. గ్రూప్-1, గ్రూప్-2 ఇతర శాఖల్లో పోస్టుల నియామకాల్లో గిరిజనులకు అవకాశాలు పెరిగాయి. గతంలో ఎన్నడు లేని విధంగా మద్యం షాపుల లైసెన్సుల్లో ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతోమందికి లబ్ధి చేకూరింది. అలాగే 38,158 మంది గిరిజన పోడు రైతులకు 1,02,703 ఎకరాలకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి రైతు బంధు, రైతు బీమా పథకాలను అందించనున్నారు. పోడు పట్టాలను జూన్ 24 నుంచి పంపిణీ చేయనున్నారు.
గిరిజనులకు పథకాలు..
తండాలు, గూడేలకు వసతులు..
గిరిజనుల కల నెరవేరింది..
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం. గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారు. సమైక్య రాష్ట్రంలో తండాలు, గూడేల పరిస్థితి అధ్వానంగా ఉండేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎంతలా మారిందో కళ్ల ముందు కనిపిస్తున్నది. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో 605 తండాలు, గూడేలను జీపీలుగా చేశారు. రిజర్వేషన్ను పది శాతానికి పెంచడంతో వి ద్య, ఉద్యోగాల్లో వారికి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. సీఎం కేసీఆర్కు గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారు.