వరంగల్, జూన్ 30(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్ : పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా చేపట్టిన ఆర్థిక సాయం పంపిణీ కొనసాగుతోంది. శుక్రవారం వరంగల్ జిల్లాలో 12,590 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.21.30 కోట్లు జమ చేసింది. దీంతో జిల్లాలో ఇప్పటికే రైతుబంధు ద్వారా 1,37,083 మంది రైతులకు రూ.98,09, 68,846 పంట పెట్టుబడి సాయం అందింది.
ఈ ఏడాది వానకాలం తొలివిడుత జిల్లాలో 1,54, 405 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా రూ.136,47,64,319 ఆర్థికసాయం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూలై 26 నుంచి నగదు జమ చేయడం ప్రారంభించింది. జిల్లాలో మండ లం వారీగా చెన్నారావుపేటలో 10,303మందికి, దుగ్గొండిలో 13,212, ఖానాపురంలో 6,413, నల్లబెల్లిలో 11,312, నర్సంపేటలో 11,011, నెక్కొండలో 12,977, గీసుగొండలో 11,903, ఖిలావరంగల్లో 4,623, పర్వతగిరిలో 12,266, రాయపర్తిలో 16,134, సంగెంలో 13,393, వరంగల్లో 1,876, వర్ధన్నపేటలో 12,842 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది.
శనివారం ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. హనుమకొండ జిల్లాలో నాలుగో రోజు వరకు మొత్తం లక్షా 28వేల 105 మంది రైతుల ఖాతాల్లో రూ.92కోట్ల 32లక్షల 3వేల 655 జమయ్యాయి. మొదటి రోజు జిల్లాలో 55,712 మందికి రూ.16.12కోట్లు జమ కాగా, రెండో రోజు రెండు ఎకరాలు ఉన్న రైతులకు రూ.43.8 కోట్లు వేశారు. బుధవారం 3వ రోజు 3ఎకరాలు ఉన్న 33,472 మందికి రూ.10.77కోట్లు జమ చేశారు.