‘ఎన్నికలు అనంగనే వచ్చే టూరిస్టులు కావాల్నా.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే పెద్ది సుదర్శన్‌రెడ్డి కావాల్నా ఆలోచించాలె’ అని నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ శివారు సర్వాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన నర్సంపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే పెద్దిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పాకాల, రంగాయ చెరువుల కాలువలను బాగుచేసుకుందామని, నర్సంపేట చుట్టూ రింగ్ రోడ్డు వేసుకుందామని చెప్పారు. పెద్దిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
వరంగల్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ) : ఆరు నూరైనా మళ్లీ ఎక్కువ సీట్లతో గెలిచి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే నర్సంపేట నియోజకవర్గానికి లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపించండి, మీకు కావాల్సిన పనులు చేసే బాధ్యత నాది’ అని స్పష్టం చేశారు. పెద్ది అధ్యక్షతన సోమవారం నర్సంపేట శివారు నర్సాపురంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సభకు హాజరైన ప్రజలను చూశాక ఇక్కడ పెద్ది కచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచిపోయాడని అర్థమవుతోందని, అరవై ఏండ్ల నాటి కల పా కాలకు గోదావరి నీళ్లను సుదర్శన్‌రెడ్డి సాధించిండని చెప్పారు. పాకాలకు గోదావరి జలాల డిమాండ్‌ను గతంలో ఎవరూ తీర్చలేకపోయారని, ఎమ్మెల్యేగా పెద్ది పాకాలకు గోదావరి జలాలను తెచ్చి నర్సంపేట నియోజకవర్గ ప్రజల కలను సాకారం చేశారని గుర్తుచేశారు. నర్సంపేట నియోజకవర్గంలో గతంలో యాసంగి 30 నుంచి 35 వేలలోపు ఎకరాల్లో పంట పండితే ఇపుడు గోదావరి జలాలు వచ్చిన తర్వాత 1.35 లక్షల ఎకరాల్లో పంట పం డుతోందని, పాకాల కింద పంటలకు ఢోకా లేకుండా చేశాడన్నా రు. పెద్ది కోరిక మేరకు ఎన్నికల తర్వాత పాకాల, రంగాయ చె రువుల కాల్వలను బాగు చేసుకుందామని, నర్సంపేట పట్ట ణం చుట్టూ రింగ్ రోడ్డు కూడా వేసుకుందామని చెప్పారు. సుదర్శన్‌రెడ్డి గెలిచిన తర్వాత తాను ఇక్కడికొచ్చి నియోజకవర్గానికి కావల్సిన పనులు చేసే బాధ్యత తనదని తెలిపారు. కచ్చితంగా దీన్ని జనంలో చర్చ పెట్టాలని, పెద్ది కమిట్మెంటును చూడాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌కు కూడా రాడని, వస్తే కారు అక్కడ ఆగదని, తెల్లారేసరికే నర్సంపేటకు వస్తాడని చెప్పారు.
జిల్లా వైద్యశాలను నర్సంపేటకు తెచ్చింది సుదర్శన్రెడ్డేనని, వరంగల్ జిల్లా కోటాలోని మెడికల్ కాలేజీ నర్సంపేటలో పెట్టాలని పెద్ది అడిగితే మంజూరు చేశామని సీఎం చెప్పారు. దీంతో నర్సంపేటకు ప్రత్యేకత ఏర్పడిందని చెప్పారు. పదేళ్ల నుంచి నర్సంపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో పనులు జరుగుతున్నాయని కేసీఆర్ వివరించారు. సమైక్యవాదులు వస్తమంటే నర్సంపేట ప్రజలు నిరసన తెలిపారని గుర్తు చేశారు. ‘వైఎస్ షర్మిల డబ్బు కట్టలతో పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఓడిస్తదట, డబ్బు కట్టలు గెలువొద్దు 24 గంటల కరెంటు గెలువాలె.. పరాయి రాష్ట్రమోళ్లొచ్చి డబ్బు సంచులతో ఓడిద్దామంటే మనం ఓడిపోదామా? ఆలోచించాలె’ అని ప్రజలను కోరారు. సుదర్శన్‌రెడ్డిని గత ఎన్నికల్లో గెలిపించి మంచి పనిచేశారని, ఆయన నాయకత్వంలో పనులు బాగా జరిగాయన్నారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్, మండలి డి ప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, రా ష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఎంపీలు మాలోత్ కవి త, దయాకర్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి నల్లా మనోహర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్‌రావు, ఊడుగుల సునీత, రమేశ్, కాట్ల కోమల, జడ్పీటీసీలు పత్తినాయక్ పాల్గొన్నారు.
ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను పోలీసులు అరెస్టు చేయడం, వాటర్ క్యాన్లతో దాడులు చేయడం వళ్ల తన ఒళ్లంతా హూనమైందని, ఒక కంటికి కూడా గాయమై కనిపించని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అందువల్లే ఎవరైనా నమస్తే పెడితే గుర్తించే పరిస్థితి ఉండడం లేదని, దీంతో ఎదుటివాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. కంటి సమస్యతోనే ఇలా జరుగుతున్నదని, ఎక్కువ సేపు నిలబడినా, తిరిగినా కాళ్లు పనిచేయలేని పరిస్థితి ఉందని, ప్రజలు తనను తప్పుగా భావించొద్దని కోరారు.
నర్సంపేట : అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు విజన్ లేదని, వారి చేతిలో నర్సంపేట అభివృద్ధి చెందదని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తనను ఓడించేందుకు ప్రతి ఎన్నికల్లో ఒక్కటవుతున్నారన్నారు. ఈ నాయకులు ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి వస్తున్నారని, ఎన్నికల తర్వాత ప్రజలకు కనిపించకుండా పోతున్నారని దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ ఈ నాయకులు ఇంటికి తాళం వేసుకొని లోపల ఉన్నారని, ప్రజలు ఆపదలో ఉంటే పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇద్దరు నాయకులకు అభివృద్ధిపై ప్రణాళిక లేదన్నారు. తనకు వాటాలు, కోటాలు లేవని, తాను రౌడీని కాదని, ప్రజల మధ్యే ఉంటున్నానని చెప్పారు. ప్రజలతోనే ఎక్కువ కాలం ఉన్నానని, నర్సంపేటలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నానని, తాను హైదరాబాదో, హన్మకొండ నుంచో రావడం లేదని చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఒక్క టర్మ్‌లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించానని తెలిపారు. కరోనాతో ప్రజలు బాధ పడుతుంటే ప్రజల మధ్యే ఉంటూ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి 1079 మందిని రక్షించినట్లు తెలిపారు. సొంత నిధులతో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయించానని గుర్తుచేశారు. ఎక్విప్మెంట్ కూడా సమకూర్చానని వివరించారు.తనకు కూడా మూడు సార్లు కరోనా వచ్చిందని గుర్తుచేశారు. నర్సంపేటలో మెడికల్ కళాశాల, జిల్లా వైద్యశాల, క్రిటికల్ కేర్ యూనిట్, హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్, డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశానని చెప్పారు. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయని, తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని చెప్పారు. రూ.180 కోట్లతో నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేశానని వివరించారు. ఉద్యమ కాలంలో నర్సంపేటలో తిరిగిన కేసీఆర్, ఇక్కడి ప్రజల జీవనస్థితిని చూశారని గుర్తుచేశారు. మళ్లీ తనను గెలిపించి కాంగ్రెస్ నాయకుల డ్రామాలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు.