హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతికోత్సవంగా పేరుగాంచిన టెక్నోజియాన్-24కు వరంగల్ నిట్ ముస్తాబైంది. ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. టెక్నోజియాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీ రింగ్ కాలేజీ నుంచి సుమారు 5 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొననున్నారు.
2006 నుంచి ప్రతి ఏడాది వరంగల్ నిట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మతక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహించే ఈ టెక్నోజియాన్‌లో ప్రతి ఏడాది ఒక కొత్త థీమ్‌తో వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది థీమ్‌ను ఆవిష్కరించనున్నారు.
రెండ్రోజుల్లో విద్యార్థులు 50కిపైగా ఈవెంట్లు ప్రదర్శించనున్నారు. స్పాట్‌లైట్స్ పేరిట జహాజ్, ఆర్సీ భగ్గీ, హోవర్ మానియా, వర్చువల్ రియాల్టీ, డ్రోన్స్ రేసింగ్, బిల్డ్ యు వర్ ఓన్ డ్రోన్, మూమ్యాట్ల్యాబ్స్, టీ వర్క్స్, ఈ-గే మ్స్, ట్రెజర్ హంట్, హాకథాన్ తదితర అంశాలతో 50కిపైగా ఈవెంట్లతో నిట్ సందడిగా మారనుంది. వీటితో పాటు ప్రముఖ దర్శకులతో చిట్‌చాట్‌తో సందడి చేయనున్నారు. వేడుకలను నేటి సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి లాంఛనంగా ప్రారంభించనున్నారు.