జనగామ, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : పీఎస్ హెచ్ఎం పదోన్నతుల్లో బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం జనగామ జిల్లా లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్టీయూ సహా వివిధ సంఘాలకు మండల కమిటీల్లో బాధ్యులుగా ఉన్న నాయకులు, సభ్యులు తమ పదవులు, సంఘ ప్రాథమిక సభ్యత్వాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆందోళన బాట పట్టారు. తొలుత జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి టీచర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని డీఈవో రాము కు మెమోరాండం ఇచ్చారు. బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒక్క ప్రమోషన్ కూ డా లేకుండా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీల ఉన్నతీకర ణ పోస్టుల్లో కూడా బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి పరిష్కరించాల్సిన ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకోవడం లేదంటూ పీఆర్టీయూ లింగాలఘనపురం, దేవరుప్పుల, కొడకండ్ల, జనగామ మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూడి సత్యనారాయణ, అంబటి అంజయ్య, వాంకుడోత్ బీకోజీ, అనిల్, బొగ్గారపు శ్రీనివాస్, గోలి తిరుపతిరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పసునూరి సోమరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా విజయపాల్‌రెడ్డి సహా 29 మందితో పాటు వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్జీటీలు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
2009 నుంచి ఇచ్చిన ప్రతి ప్రమోషన్ కౌన్సెలింగ్ ద్వారా బీఈడీ అర్హత గల ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించి ఇప్పుడు మాత్రం నిరాకరిస్తుండటా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధనకు పనికొచ్చిన బీఈడీ అర్హతలు ఉన్న ఎస్జీటీలు అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఎం దుకు పనికిరారో ప్రభుత్వం చెప్పాలని నిలదీస్తున్నారు. ప్రధానోపాధ్యాయులుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన బీఈడీ ఎస్జీటీలకు ఇప్పుడు అర్హత లేదనడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలను పాటించక పోవడం వల్ల బీఈడీ అర్హత ఉన్న తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న దాదాపు 60వేల మంది ఎస్జీటీల సమస్య, మనోవేదన అని దీనిపై ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసి గతంలో మాదిరిగా బీఈడీ అర్హతలు ఉన్న తమకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించి, సమన్యాయం చేయాలని ఎస్జీటీలు కోరుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను 10 వేలకు పెంచాలని డీఈవోకు ఇచ్చిన వినతిపత్రంలో ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.