Warangal DEO | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 14 : వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కె.సత్యనారాయణరెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా డీఈవో మామిడి జ్ఞానేశ్వర్ అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పై కులం పేరుతో దుర్భాషలాడడం, ‘తమాషా చేస్తున్నావా?’ అని బెదిరింపులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. జిల్లా విద్యాశాఖను ముందుండి నడిపించాల్సిన స్థాయిలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న అతని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ‘రిజర్వేషన్లో ఉద్యోగం వచ్చింది కాబట్టి గ్రీన్ పెన్ను పట్టుకుంటే సరిపోతుందా?‘ అని ఏఎంవో సుజన్తేజను అవమానపరిచేలా మాట్లాడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
అంతేకాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ సమస్యల పట్ల నిర్లిప్త వైఖరి, ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తున్న డీఈవో తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలా కులనేపథ్యాన్ని కించపరిచే విధంగా, ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్న డీఈవో జ్ఞానేశ్వర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌జీహెచ్‌ఎంఏ, టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, టీపీయూఎస్, ఎస్సీఎస్టీయూఎస్ సంఘాల రాష్ర్ట, జిల్లా నాయకులు ఎస్.రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, భోగేశ్వర్, తాటికాయల కుమార్, సుజన్ ప్రసాదరావు, గోవిందరావు, వెంకటరమణ, ఆచార్య ప్రద్యుమ్న, పరశురాములు, నర్సయ్య, ఎస్.ఎ.రవూఫ్, ఎస్.వెంకన్న, కె.రవీందర్, గుండు కరుణాకర్, నామోజు శ్రీనివాస్, వి.అరవింద్‌కుమార్, కె.కుమారస్వామి ఉన్నారు.