నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 93.55 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఇంకా తుది లెక్కలు వెలువడాల్సి ఉందని, ఇందులో స్వల్ప తేడాలుండవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 200 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఓటు వేశారు.
అందులో 150 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంత మండల కేంద్రాల్లోనే ఉండడంతో అక్కడ ఓటింగ్ మందకొడిగా కొనసాగింది. పట్టణాలతోపాటు 11 జిల్లా కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ఓటర్లు బారులుదీరారు. కొన్నిచోట్ల పోలింగ్ ముగిసే సమయానికి కూడా ఓటర్లు క్యూలో వేచి ఉన్నారు. కాగా మొత్తం ఓటర్ల సంఖ్య 25,797 ఉండగా, ఇందులో 24,132 మంది టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజక వర్గం పరిధిలో సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలుండగా, వీటన్నింటిలో 91 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది.
కాగా అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 96.54 శాతం నమోదవగా, అత్యధిక ఓట్లున్న హనుమకొండలో 91.66 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన అనంతరం 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లన్నీ ప్రత్యేక బందోబస్తు నడుమ అర్ధరాత్రి నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచి సీల్ వేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నెల 3న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరుగనుండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
2019 మార్చిలో జరిగిన ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగింది. గతంలో 20,888 మంది ఓటర్లుండగా అందులో 18,884 మంది ఓట్లేయగా, 90.41 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్ శాతం కూడా 2.14 శాతం పెరగడం గమనార్హం. గతంకంటే ఈసారి ప్రధాన సంఘాల అభ్యర్థుల సంఖ్య ఎక్కువుండడంతో అందరూ గెలుపు కోసం సర్వశక్తులొడ్డారు. దీంతో ఎక్కువ మంది ఓటర్లను కూడా అభ్యర్థులు కలవడం.. ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను డబ్బు, మద్యం తదితర ప్రలోభాలూ ప్రభావితం చేసినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడా చిన్న ఘటన కూడా చోటుచేసుకోలేదు. పోలింగ్ సందర్భంగా ఆయా అభ్యర్థుల తరపున సంఘాల నేతలు, అనుచరులు కేంద్రాల వద్ద సందడి చేసినా సజావుగా పోలింగ్ ముగియడంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల వెలుపల ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు తమ అభ్యర్థికి మద్దతుగా టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటారం డివిజన్ (కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలు)లో మొత్తం 2,483 మంది ఓటర్లుండగా 1,903 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 76 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానంలో 83 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 92 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే హనుమకొండ జిల్లా పరిధిలో మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి భీమదేవరపల్లి, ఎలతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4,585 మంది ఓటర్లుండగా 1,780 మంది తమ ఓటు హకు వినియోగించుకోగా, 38.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవే మండలాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 166 మంది ఓటర్లుండగా, 103 మంది ఓటు వేయగా, 62.05 శాతం పోలింగ్ నమోదైంది.