వరంగల్, జూలై 4 ; పన్నుల వసూళ్ల సొమ్ము గ్రేటర్ కార్పొరేషన్ ఖాతాలో కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ పన్నుల వసూళ్ల ప్రోగ్రామింగ్ రూపొందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) తప్పిదం వల్ల బల్దియా ఖాతాలో జమ కావాల్సిన రూ. 2.50 కోట్లు తొర్రూరు మున్సిపాలిటీ ఖాతాలో జమయ్యాయి. గ్రేటర్ కార్పొరేషన్ ఖాతాలో వైరా, యాదాద్రి మున్సిపాలిటీలకు చెందిన డబ్బులు పడ్డాయి. నెల రోజుల తర్వాత సంస్థ ప్రతినిధులు తప్పును గుర్తించి చెప్పే వరకు బల్దియా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. తొర్రూ రు మున్సిపాలిటీ ఖాతాలో జమైన డబులు ఖర్చయ్యాయని, పన్నుల వసూళ్ల సొమ్ము ఎప్పుడు తిరిగి వస్తా యోననే అయోమయం నెలకొంది.
వరంగల్ కార్పొరేషన్లో నెల రోజులుగా ఆస్తి, నీటి పన్నులతోపాటు ట్రేడ్ లైసెన్స్ రూపేణా వసూళ్లయిన సొమ్ము తొర్రూరు మున్సిపాలిటీ ఖాతాలో జమైంది. నెల రోజుల తర్వాత తప్పిదాన్ని గుర్తించిన సీజీజీ సంస్థ విషయాన్ని తెలుపడంతో బల్దియా అధికారులు ఖంగుతిన్నారు. సొమ్మును తిరిగి ఇవ్వాలని గ్రేటర్ అధికారులు లేఖ రాయగా ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీలో అన్ని డబ్బులు బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు ఖర్చయ్యాయని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. గ్రేటర్ కార్పొరేషన్ ఖాతాలో వైరా, యాదాద్రి మున్సిపాలిటీలకు చెందిన పన్నుల వసూళ్ల సొమ్ము సుమారు రూ. 50 లక్షలు డబ్బులు జమైనట్లు తెలుస్తోంది. అసలే చిన్న మున్సిపాలిటీలు కావడంలో పన్నుల వసూళ్లు సొమ్ము రాకపోవడంతో జీతాలు, ఇతర అవసరాలకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్రస్థాయి మున్సిపల్ అధికారులు గ్రేటర్ కార్పొరేషన్‌కు వైరా, యాదాద్రి మున్సిపాలిటీలకు చెందిన డబ్బులను తిరిగి చెల్లించాలని లేఖలు రాశారు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో జమైన గ్రేటర్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 2.50 కోట్లు ఎప్పుడు తిరిగి వస్తాయనే దానిపై స్పష్టత లేదు.
సీజీజీ తప్పిదంతో గందరగోళం
సీజీజీ సంస్థ తప్పిదం వల్ల గందరగోళం ఏర్పడింది. దీంతో నెల రోజులుగా గ్రేటర్ కార్పొరేషన్లో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. 9 మీ సేవ సెంటర్లలో పన్నుల వసూళ్లు నిలిపివేశారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పన్నులు స్వీకరించే కౌంటర్‌ను మూసివేశారు. సీజీజీ ప్రోగాంను సరిచేసిన తర్వాత ఆన్లైన్లో పన్నుల వసూళ్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.