స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 28 : అమలు కాని హామీలిచ్చి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిం చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కహానీలు ఇక సాగవని, నిన్నటివరకు ఒక లెక్క, ఇప్పటి నుం చి ఇంకో లెక్క అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా పహల్గాంలో ఉగ్రదాడికి బలైన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పా టించి నివాళులర్పించారు. అనంతరం ఎల్కతుర్తి రజతోత్సవ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ తరపున రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతం కావడానికి కృషిచేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సభను ఫెయిల్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసినా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని, జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నారని చెప్పేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నా రు. కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను బీఆర్ఎస్ తరఫున రాజ య్య డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల అవసరాలకునుగణంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కేసీఆర్ జనరంజక పాలన అందించారని, కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్నదన్నారు.
రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్, ఖర్గేతో ఎస్సీ రిజర్వేషన్, సోనియాగాంధీతో ఎన్నికల మ్యానిఫెస్టో చేయించి ప్రజల న మ్మకాన్ని ఖూనీ చేశారని రాజయ్య విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో దేవుళ్లపై ఓట్లు పెట్టి, హామీలు నెరవేర్చలేదన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 60వేల కోట్లు అప్పుతెచ్చి రాహుల్‌గాంధీకి కమీషన్ పంపారని రాజయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొన్న గ్రామంలో ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలుచేయలేదన్నారు. హామీలు నెరవేర్చే వరకు ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తామన్నారు.
అధికారులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, అతిగా ప్రవర్తించే అధికారులు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ కేసులకు భయపడవద్ద ని, బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ జడ్పీటీసీలు రవి, కీర్తి వెంకటేశ్వర్లు, ఆకుల కుమార్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, కమలేశ్, హీరాసింగ్, పావని, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.