పరకాల, జూలై 12 : పరకాల ఉమ్మడి మండల వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తం లో పీడీఎస్ బియ్యాన్ని, పొగాకు ఉత్పత్తులను పట్ట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల పట్టణం, నడికూడ మండలంలోని చర్లపల్లి గ్రామంలో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. నడికూడ మం డలం చర్లపల్లిలో నిర్వహించిన దాడుల్లో రూ.9.5లక్షల విలువ చేసే 360 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, డీసీఎంను స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తూర్పాటి ఐలయ్య, నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన బండి శంకర్, బండి కుమార్తో పాటు పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి మధూకర్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటు రూ.1.58లక్షల విలువ చేసే గుట్కాలను రేపాల చంద్రశేఖర్ గుప్తా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని, పొగాకు ఉత్పత్తులను, డీసీఎంను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు.