హనుమకొండ చౌరస్తా, జులై 15: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో రూ.171 కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి జైపాల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 జులై 11న బీసీసీఐ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్-హెచ్సీఏ మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాన్ని హెచ్సీఏ ఇప్పటికీ అవలంభించకుండా చట్టవ్యతిరేకంగా పూర్తిగా విస్మరించిందన్నారు.
హెచ్సీఏలో అవినీతి, ఆర్థిక కుంభకోణాలు కొత్త విషయాలు కావు, ప్రతి సంవత్సరం బీసీసీఐ రూ70 నుంచి రూ.80 కోట్ల వరకు నిధులను క్రికెట్, మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేస్తుంది. కానీ 15 సంవత్సరాల్లో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదన్నారు. కేవలం గత 2 సంవత్సరాల్లో బీసీసీఐ రూ.171 కోట్లు మంజూరు చేసినా హైదరాబాద్ నగరంగానీ, రాష్ట్రవ్యాప్తంగా గానీ అభివృద్ధికి కనీస ప్రయత్నం జరగలేదు. అయినప్పటికీ హెచ్సీఏ ఖాతాలను ఎటువంటి సమగ్ర నిర్దారణ లేకుండానే ఆమోదిస్తున్నారన్నారు.
బీసీసీఐ మాత్రం హెచ్సీఏ రికార్డులను పరిశీలించకుండానే నిధులు విడుదల చేస్తుందని, ఈ నేపథ్యంలో టీం సెలక్షన్లో అవినీతి, కమీషన్లు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిఫారసుల విస్మరణ వంటి విషయాలు కొనసాగుతున్నాయి. బీసీసీఐ నిధులను వ్యక్తిగత లాభాల కోసం మళ్లించడం కూడా అదేవిధంగా సాగుతోందని జైపాల్ ఆరోపించారు. క్రికెట్ అభివృద్ధికి పారదర్శకమైన కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని జైపాల్ కోరారు.