మహబూబాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సమష్టిగా కదిలి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లక్షలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారని తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సభ వేదిక వద్దకు చేరుకునేలా బయలుదేరాలని సూచించారు.
ప్రతి వాహనానికి ఒక ఇన్చార్జితో పాటు కావాల్సిన ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సమకూర్చినట్లు తెలిపారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విరక్తి చెందిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేరొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఊరు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని తక్కళ్లపల్లి కోరారు. సమావేశంలో మానుకోట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల వేణు, రఘు, తెల్ల శీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామలోని క్యాంపు కార్యాలయంలో వీరికి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా పాలనలో పూర్తిగా విఫలమైందని, స్థానిక ఎమ్మెల్యే పల్లా చేస్తున్న ప్రజాసేవ తమకు నచ్చిందని, ఆయన పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న కృషికి ఫిదా అయి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
చిల్పూరు, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో పార్టీ మండల ఇన్చార్జి మాలోత్ రమేశ్‌నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో క్లస్టర్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని, సభ వాల్‌పోస్టర్లను విడుదల చేయాలని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలన్నారు.
సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి, చిల్పూరు ఇన్చార్జి ముత్యాల బాలనర్సయ్య, యూత్ అధ్యక్షుడు శివగామి అంజయ్య, కొమురవెల్లి దేవస్థానం మాజీ డైరెక్టర్ గిరిధర్, చేర్యాల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా నాయకులు జనగామ యాదగిరి, బత్తుల రాజన్‌బాబు, తాళ్లపల్లి జగన్నాథం, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు బత్తుల రాజన్‌బాబు, రంగు హరీశ్ తదితరులు పాల్గొన్నారు.