ఏటూరునాగారం, ఏప్రిల్ 8: పేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయి డయాగ్నొస్టిక్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విస్తరింపజేస్తున్నది. ఈమేరకు మండల కేంద్రంలో రూ.1.30కోట్లతో భవన నిర్మాణం పూర్తయ్యింది. ఏటూరునాగారం మండల కేంద్రంలో మాతా-శిశు కేంద్రం, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంకులు ఇప్పటికే ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వైద్య సేవలను అందిస్తోంది. ములుగు జిల్లా కేంద్రంలో టీ డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏటూరునాగారం ఏజెన్సీలోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేయనున్నది. వాజేడు, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని శివారు గ్రామాలకు ములుగు జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్లకుపైగా ఉంటుంది.
వారికి ములుగులోని టీ డయాగ్నొస్టిక్ హబ్ ఉన్నందున ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో సామాన్యులకు ప్రయాణ తిప్పలు తప్పడంతోపాటు వ్యాధి నిర్దారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. టీ డయాగ్నొస్టిక్ హబ్‌లో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనుంది. ప్రైవేట్ వైద్యశాలల్లో నిర్ధారణ పేర దోపిడీ చేస్తున్నారు. పరీక్ష రాసి డబ్బులు గుంజుతుండడంతో నిరుపేదల జేబులు గుల్లా అవుతున్నాయి. దీంతో కూలి చేసుకునే వారి పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఈ పేదలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోనూ టీ డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటుకు ఆరోగ్య శాఖ ఆర్టికల్-275 కింద రూ.90లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. భవనాన్ని మరింత మాడిఫికేషన్గా నిర్మించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.40లక్షలు అదనంగా చేశారు. రూ.1.30కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేసినట్లు గిరిజన సంక్షేమశాఖ ఈఈ హేమలత తెలిపారు. ఇందులో సుమారు 15గదుల వరకు ఉండనున్నాయి. భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. భవనం ముందు మట్టి, కంకర పోసి లెవలింగ్ చేశారు.
ఏజెన్సీలో పెరుగుతున్నసర్కార్ వైద్యసేవలు
ఏటూరునాగారం మండ ల కేంద్రంలో ప్రజలకు ఇప్పటికే అనేక వైద్యసేవలు అందుతుండగా వ్యాధి నిర్దారణ పరీక్షల కోసం టీ డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, థైరాయిడ్, బీపీ, సీబీపీ, మైక్రో టీబీ, ఎక్స్‌రే, స్కానింగ్, ఈసీజీ, అల్ట్రా సౌండ్, డయాబెటిస్, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కీళ్లవాతం, కాలేయం వంటి అనేక వ్యాధులకు ఇక్కడ ఉచిత పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏజెన్సీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీన్ని అనుసంధానం చేయనున్నారు. దీంతో ఆయా పీహెచ్‌సీల పరిధిలోని వారు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికే రానున్నారు. పీహెచ్‌సీల్లో సేకరించిన రక్త నమూనాలను ఇక్కడికి పంపి పరీక్షలు చేసి రోగి సెల్ నంబర్‌కు నిర్ధారణ పరీక్షా రిపోర్టులు పంపనున్నారు. అంతేకాకుండా ఆయా పీహెచ్‌సీలకు కూడా రిపోర్టులు వెళ్లనున్నాయి. ఏటూరునాగారంలో టీ డయాగ్నొస్టిక్ హబ్ భవన నిర్మాణం పూర్తి కాగా, అవసరమైన పరికరాలను ప్రభుత్వం సమకూర్చనుంది.