ఏటూరునాగారం, జూన్ 2 : వ్యవసాయ రంగంలో గిరిజనులను తీర్చిదిద్దాల్సిన ఐటీడీఏలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ కనుమరుగయ్యాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఏండ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు అధునాతన వ్యవసాయాన్ని అంది పుచ్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు సుమారు రూ.2 లక్షల ఎకరాల సాగు భూమిని కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. వ్యవసాయంతోపాటు పండ్ల తోటల సాగులో గిరిజనులకు మెళకువలు నేర్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఐటీడీఏ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని గిరిజనులు వాపోతున్నారు.
ఐటీడీఏలో ప్రాజెక్టు వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి, విస్తరణ అధికారులు, ఉద్యాన శాఖలో ప్రాజెక్టు హార్టికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఏండ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గిరిజనులు మిర్చి, పత్తి, వరి, మక్కజొన్న, జొన్న, వేరుశనగ, కందులు, మినుములు, పెసర ఇతర అంతర పంటలను సొంతంగానే సాగు చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, పంటల అధిక దిగుబడి, చీడ, పీడ, పురుగుల నివారణ పంటల సాగులో మెళకువలు నేర్పించాల్సిన అధికారులు క్షేత్రస్థాయి సందర్శనలు చేయకపోవడంతో గిరిజనులు అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవడంలేదు.
భూసార పరీక్షలు, కొత్త వంగడాల సాగుపై అవగాహన, స్టడీటూర్లు, పంటలను విక్రయించేందుకు మార్కెట్లు లేకపోవడంతో గిరిజనులు సాగురంగంలో రాణించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఐటీడీఏలోని ఉద్యాన శాఖ ద్వారా మామిడి, జామ, జాక్ ఫ్రూట్, పనస, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, కూరగాయలు సాగు చేసే అవకాశం ఉన్నా సంబంధిత శాఖ అవగాహన కల్పించడం లేదు. దీంతో గిరిజనులు ఇప్పటికీ మూస పద్ధతిలోనే పంటలు సాగు చేసి నష్టమో, లాభమో చేతులు దులుపుకుంటున్నారు.
గిరిజనులు సాగు చేసుకున్న పోడు భూములకు ప్రభుత్వాలు హక్కు పత్రాలను అందజేశాయి. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 48,491 మంది రైతులకు 1,29,779ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలిచ్చారు. అయితే ఈ భూములు ఏ పంటలకు అనుకూలమో ఇప్పటివరకు అధికారులు సర్వే చేసి తేల్చలేదు. దీంతో ఏ పంట వేయాలో తెలియక గిరిజన రైతులు ఏదో ఒక పంట సాగు చేయడమో.., లేక బీడుగా ఉంచడమో చేస్తున్నారు.
కనీసం రైతులకు ఏం విత్తనాలు తీసుకోవాలనే విషయం కూడా చెప్పడం లేదు. పంటల సాగుకు ఇటీవల కాలంలో అనేక రకాల ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. వాటి సమాచారం కూడా అధికారులు రైతులకు అందించడం లేదు. వాటి వాడకంపై అవగాహన కల్పించడం లేదు. దీంతో ఏండ్లుగా గిరిజన రైతులు మూస పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి గిరిజన రైతులకు తగిన శిక్షణ ఇస్తే సాగు రంగంలో రారాజులయ్యే అవకాశం ఉంది.