సుబేదారి, మార్చి7 : వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ నియామకమయ్యారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి నుంచి అంబర్ కిశోర్‌ఝా రామగుండం సీపీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వచ్చారు. పంజాబ్‌కు చెందిన ఈయన 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఈయనకు ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. 2012లో ములుగు జిల్లా ఏ ఎస్పీగా, వరంగల్ రూరల్ జిల్లా ఓఎస్డీగా పనిచేశారు.
ఆ తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా విధులు నిర్వర్తించారు. కాగా అంబర్ కిశోర్ ఝా 2023 అక్టోబర్ 13న వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టి 17 నెలలు పనిచేశారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గతే డాదిలో జరిగిన ఎంపీ ఎన్నికల విధి నిర్వహణలో ఆయన సమర్థవంతంగా సేవలందించారు.ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్ కుమార్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీగా వెయిటింగ్లో ఉన్న అంకిత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీసీపీ రవీందర్ ఎన్సీకి బదిలీ అయ్యారు.
క్రైం డీసీపీగా జనార్దన్: వరంగల్ పోలీసు కమిషనరేట్ క్రైం విభాగం డీసీపీగా బీ జనార్దన్ నియామకమయ్యారు. ట్రాన్స్‌కోలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించి వరంగల్ క్రైం డీసీపీగా నియమించింది. జనార్దన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సై, ఇన్స్పెక్టర్, ఏసీపీగా పనిచేశారు.