హనుమకొండ చౌరస్తా/నయీంనగర్, మే 20: కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగినప్పటికీ అధికారులు పరీక్షలు వాయిదా వేయకపోవడంతో మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న కేయూ, హనుమకొండ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్న క్రమంలో పరీక్షలు వాయిదా వేయాలని కోరినప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. యూనివర్సిటీ అధికారులు, పోలీసులకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న క్రమంలో తోపులాట జరగగా, విద్యార్థులను లాక్కెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించి అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
కులం పేరుతో దూషించారని విద్యార్థినుల ఆవేదన
పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం ఆందోళన చేస్తున్న క్రమంలో రాత్రి 1 గంటకు తమను లేడీ కానిస్టేబుళ్లు లేకుండా సీఐ రవికుమార్ స్టేషన్కు తీసుకుపోయి 3 గంటలకు వరకు ఉంచాడని విద్యార్థినులు అనూష, స్వాతి వాపోయారు. దళిత విద్యార్థినులని తెలుసుకున్న సీఐ ‘నాకే ఎదురు తిరుగుతారా.. మీరు మళ్లీ ధర్నా చేస్తే స్టేషన్కు తీసుకొచ్చి నానా ఇబ్బందులకు గురిచేస్తాం’.. అంటూ బెదిరించినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్కు తీసుకురావడమే కాకుండా బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాము ఏమైనా టెర్రరిస్టులమా అని విద్యార్థినులు నిలదీశారు.