నర్సింహులపేట, మార్చి 19 : వేసవి ప్రారంభంలోనే దంచికొడుతున్న ఎండలతో చెరువులు, కుంటలు ఎండిపోతూ భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. దీంతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతుండగా తాగు నీటి ఎద్దడి తరుముకొస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక గ్రా మంలో తాగునీరు వృథాగా పోతుంటే, మరోచోట ప్రజలు నీటికోసం అరిగోస పడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం పా ఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద తాగు నీరు పైపులో నుంచి వృథాగా పోతున్నది. అలాగే గ్రామంలో ని పైప్లైన్ కూడా లీకేజీ కావడంతో నీరంతా బయటకు వచ్చి అపరిశుభ్రంగా మారుతున్నది. ఇదిలా ఉంటే మండలంలోని చర్లచంద్రుతండా ప్రజలు అష్టకష్టాలు పడుతూ వ్యవసాయ బావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.