పరకాల, మార్చి 31: అభివృద్ధికి ఆమడదూరంలో పరకాల నియోజకవర్గం నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ. 10 కోట్ల నిధులతో చేపట్టిన వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, చిరువ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ పనులు నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయి. 90 శాతం పనులు పూర్తయి కేవలం కొదిపాటి నిధులు వెచ్చిస్తే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టింపులేనట్లు వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరకాల పట్టణంలో సుమారు రూ.10 కోట్ల నిధులతో వంద పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మారెట్, చిరు వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్, వైకుంఠధామం నిర్మాణాలు ప్రారంభించగా, 90శాతం మేర పనులు పూర్తి చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించకపోవడంతో ఎక్కడివి అక్కడే నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రెండేళ్లుగా ఒక్క ఇటుక పెట్టలే..
రోడ్ల పక్కన తోపుడు బండ్లపై వ్యాపా రం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన షా పింగ్ కాంప్లెక్స్‌లో 150 మంది వ్యాపా రం చేసుకునే విధంగా స్లాబ్ వరకు, వెల్లంపల్లి రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం 90 శాతం పూర్తి చేశారు. అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణ శివారులోని చలివాగు వద్ద వైకుంఠధామం, దామెర చెరువు మినీ ట్యాంక్‌బండ్, డంపింగ్‌యార్డు పనులు చేపట్టగా చివరి దశలో నిలిచిపోయాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో నేడు అసంపూర్తి నిర్మాణాలుగా మిగిలి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయాలి
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే వెంటనే నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయాలి. ప్రజలకు ఉపయోగంగా ఉండే వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ పనులు 90శాతం మేర గతంలోనే పూర్తయ్యాయి. కొద్ది పాటి నిధులు వెచ్చిస్తే అవి అందుబాటులోకి వస్తాయి. ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అసంపూర్తి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
– రేగూరి విజయపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, పరకాల