బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పోడు రైతులకు పండుగ వాతావరణంలో పట్టా పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మోదీ వరంగల్ వచ్చేముందు ఇచ్చిన హామీలపై కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ‘బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగు గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎటుపోయినయ్.. వరంగల్ వచ్చేముందు ప్రధాని మోదీ వీటిపై సమాధానం చెప్పాలె’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మానుకోటలోని ఎన్టీఆర్ స్టేడియంలో గిరిజనులకు శుక్రవారం ఆయన పోడుపట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ‘కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్‌కు తరలించుకుపోయిండ్రు.. అక్కడ రూ.21వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్రు.. తెలంగాణలో మాత్రం ఏర్పాటు చేయరు.. గుజరాత్‌కు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?’ అని ప్రశ్నించారు. ‘గిరిజన బిడ్డల తరఫున ప్రధాని మోదీని అడుగుతున్నా.. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అడిగితే గిరిజన యూనివర్సిటీ కోసం 360 ఎకరాల పైచిలుకు భూమిని ఇచ్చాం.. ఎందుకు పెడతలేరు?’ అని నిలదీశారు. ‘ఇక్కడే ఉన్నది మా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం ఉన్నది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పి అదే చట్టంలో ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అక్కడ ఇనుము నిక్షేపాలు ఉన్నాయని చెప్పింది. స్టీల్ అథారిటీ ఇండియా ద్వారా పెడతామని చెప్పి తొమ్మిదేండ్లయింది. ఏమైంది ప్రధాన మంత్రిగారూ..’ అంటూ దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ అంటే రైలును తయారు చేయిస్తా అన్నావ్.. ఇప్పుడు ఏం పెడుతున్నావ్.. రైళ్లు రిపేరు చేసే దుకాణం పెడుతున్నావ్.. ఇది న్యాయమా నీకు..’ అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘కాంగ్రెసోళ్లను చూస్తే నాకు ఒక కథ గుర్తు వస్తోంది’ అంటూ మంత్రి కేటీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. ‘ మహబూబాబాద్‌లాంటి పట్టణంలో ఓ చిన్న పిల్లవాడు ఉండె. వానికి సదువు రాదు.. చెడు సోపతులతో చెడిపోయిండు. అలానే పెరిగి పెద్దోడయ్యిండు. ఓ రోజు బాగా తాగి, ఇంకింత తాగాలనిపించి వాళ్ల నాన్న ప్యాంట్ల కెల్లి పైసలు కొట్టేయబోతే వాళ్ల అమ్మ చూసి దవడ మీద రెండు సంపింది. వాడు తాగి ఉన్న మత్తులో రోకలిబండతోని వాళ్లమ్మను గట్టిగ కొట్టి సంపిండు. వాళ్ల నాన్న చూసి ఉరికొచ్చి ఎంత పని చేసినవ్రా అని చెప్పి వంగబెట్టి రెండు గుద్దిండు. అదే రోకలిబండతోని వాళ్ల నాన్నను కూడా కొట్టి సంపిండు. పోలీసులు పట్టుకొని జైలులో పెట్టిండ్రు. శిక్ష వేయాలి కదా..? ఆ జడ్జి మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాగ మంచోడు. వాడిని కిందికి మీదికి చూసి అరె నా జీవితంల చాలా మంది గలీజ్ గాళ్లను, లత్కోర్ గాళ్లను చూసినగని నీ అసోంటోన్ని చూడలేదు. సొంత తల్లిదండ్రులనే చంపి కాలబెట్టినవ్. నీకు ఏం శిక్ష వేయాల్నో నాకైతే అర్థమైతలేదు.. నువ్వే చెప్పి కాలబెట్టు అన్నడట. అప్పటి వరకు రుబాబుగ నిలబడ్డోడు. చేతులు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను.. నన్ను ఇడిసిపెట్టున్రి.. నేను ఇంటికి పోత అన్నడట. తల్లిదండ్రిని సంపినోడే నేను అనాథ అంటడు. ఇప్పుడు కాంగ్రెస్సోళ్ల తీరు అట్లనే ఉంది.. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్సోళ్లు వచ్చి ఇది ఇట్లెందుకుంది.. అది అట్లెందుకుంది అంటే మనం ఎవరికి చెప్పాలె.. ఇన్నేండ్లు పాలించిన కాంగ్రెస్సోళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిర్రా?’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మితే ఆగమైతరని ప్రజలకు సూచించారు. ‘నేను ఒక్కటే చెబుతున్నా. పేదలను కడుపు, గుండెలో పెట్టుకొని చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను తిరిగి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మళ్లీ పేదల కోసం పని చేసేలా అందరం కలిసికట్టుగా నడుద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ కేసీఆర్‌గారి నాయకత్వంలో పని చేద్దా’మని పిలుపునిచ్చారు.

‘మానుకోటల ఈ రోజు ఉదయం నుంచి మీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నాకు ఇద్దరు కలిశారు. వారితో నేను మాట్లాడిన ఒకామెపేరు ద్వాలి.. ఆమె తనకు భర్త లేడు అని చెప్తే పెన్షన్ వసున్నదా అని అడిగిన.. మా పెద్దన్న కేసీఆర్ ఉన్నడు. ప్రతి నెలా రెండువేల పెన్షన్ వస్తున్నదని చెప్పింది. బిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి వచ్చింది. కొడుకు గురుకుల పాఠశాలల చదువుతున్నడని చెప్పింది. అన్న నాకు రూపాయి ఖర్చు లేకుండ పుస్తకాలు, కాపీలు, బూట్లు, చద్దర్లు ఇట్ల రూ.1.20 లక్షలు పెట్టి ప్రభుత్వమే నా కొడుకును చదివిస్తున్నది. నా కొడుకు డాక్టరో, ఇంజినీరో అయితడు. అప్పుడు నేను కూరగాయలు అమ్ముడు బంజేస్తా అని గ్వాలి చెబుతుంటే ఎంతో సంతోష పడ్డా. అక్కడే ఇంకో మహిళ అత్తలూరి రమాదేవి కనపడ్డది.. అమె కూడా ఇదే మాట చెప్పింది. ఆమెకు ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డకు కల్యాణ లక్ష్మి వచ్చింది. ఇంకో బిడ్డకు కూడా వస్తదన్న నమ్మకముందని చెప్పింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. నాడు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మహబూబాబాద్ నేడు జిల్లా కేంద్రమైందంటే కారణం సీఎం కేసీఆరేనని గుర్తించుకోవాలి.. ఇక్కడ బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టుకున్నం. ఎస్పీ, మున్సిపల్ కార్యాలయాలు కట్టుకుంటున్నం. కలలో కూడా ఊహించని విధంగా మానుకోటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చింది. జిల్లా దవాఖాన వచ్చింది. మా హాస్పిటల్లో నాడు పది మంది కూడా ఉండకపోతుండే.. ఇప్పుడు 140మంది డాక్టర్లున్నరని మంత్రి సత్యవతి అక్క నాకు గర్వంగ చెప్పింది. ఇదంతా ప్రజలు గుర్తించాలి’ అని మంత్రి కేటీఆర్ కోరారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, హరిప్రియ, ఆరూ రి రమేశ్, నన్నపునేని నరేందర్, జడ్పీ అధ్యక్షులు అంగోత్ బిందు, గండ్ర జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పోడు పట్టాల పంపిణీ సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఆశించిన స్థాయికంటే గిరిజనులు, రైతులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై ప్రజలు, రైతులు, గిరిజనులు పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం వారం నుంచి మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బయ్యారం జూన్ 30 : పోడు రైతులను ఆప్యాయంగా పలుకరిస్తూ.. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారితో మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. పోడు పట్టాల పంపిణీ అనంతరం పకనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 150 మంది పోడు రైతులతో కలిసి వారి మధ్య కూర్చొని భోజనం చేస్తూ గిరిజన మహిళలతో ముచ్చటించారు. పోడు పట్టాలు ఇవ్వడం ఎలా ఉందని ప్రశ్నించగా.. తాము ఎన్నో ఏళ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్నామని.. ఇప్పుడు తమ కల నెరవేరిందని మంత్రికి ఆనందంగా తెలియజేశారు. రైతులు ఇకనుంచి దర్జాగా వ్యవసాయం చేసుకోవాలని, అటవీ శాఖ అధికారుల ఇబ్బంది ఇకపై ఉండదని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.మంత్రి కేటీఆర్ తమతో ముచ్చటిస్తూ భోజనం చేయడంపై గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో మంత్రు లు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, బానోత్ హరిప్రియా నాయక్, అరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్లు అంగోత్ బిందు, గండ్ర జ్యోతి, కలెక్టర్ శశాంక ఉన్నారు.
మహబూబాబాద్ రూరల్, జూన్ 30 : సీఎం కేసీఆర్ వల్లే ఇవాళ పోడు రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతోంది. ఇదివరకు ఎందరో పాలకులు పోడు రైతులను మోసం చేశారు. పోడు రైతుల గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారు. పోడు చేసుకుంటున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలుచేయడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మాత్రమే తండాలు, గూడేల్లో ఉన్నోళ్ల కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారి బాగు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 70 ఏండ్ల నాటి కలను కేసీఆర్ నెరవేర్చారు.
-ఇస్లావత్ సతాని, కొత్తగూడ