వరంగల్, ఏప్రిల్ 20 : నగరాలు, పట్టణాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టేలా కార్పొరేషన్, మున్సిపాలిటీలు చ ర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగర పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన 10 అభివృద్ధి అంశాలను ఆయన వివరించారు. మొదట వరంగల్ నగరంలో నియో మెట్రో రైలు డీపీఆర్ పై కమిషనర్ ప్రావీణ్య పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. మెట్రో నియో రైలు డీపీఆర్ పూర్తయ్యిందని మంత్రికి వివరించా రు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నియో మెట్రో రైలు కోసం డీపీఆర్ సిద్ధమైన నేపథ్యంలో వెంటనే పనులు చేపట్టాలన్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించా రు. మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. త్వరలోనే నియామకాలు చేపట్టి సిబ్బంది కొరత తీరుస్తామని వివరించారు. మున్సిపాలిటీల్లో 50 వేల జనాభాకు ఒక వార్డు అధికారిని, గ్రేటర్లో వర్క్ ఇన్స్పెక్టర్లను నియమిస్తామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనల మేరకు లక్ష జనాభాకు 280 మంది పారిశుధ్య కార్మికులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో నిధులు వినియోగించుకోవాలి..
మున్సిపాలిటీలకు మంజూరైన నిధులను ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవాలని సూచించారు. టీయూఎఫ్ఐడీసీలో మంజూరైన నిధులకు టెండర్లు పూర్తి చేసి వంద శాతం నిధులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. వరంగల్ స్మార్ట్‌సిటీ పథకంలో రాష్ట్ర వాటా నిధులు రూ. 250 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ క్రెడిట్ రేటింగ్ ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 90 కోట్ల రుణం మంజూరు చేస్తున్న తరుణంలో ఆదాయ మార్గాలపై ఖర్చు చేయాలని అన్నారు. ఆ నిధులతో హనుమకొండ, వరంగల్ బస్ స్టేషన్లను స్మార్ట్ బస్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనుల ఆలస్యంపై పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేనప్పుడు నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. జూన్ 1 నాటికి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్యను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. నగరం చుట్టూ ఉన్న వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ చేసి లేఔట్ ప్లాట్ల ద్వారా ఆదాయం పెంచుకుని నగరాభివృద్ధిలో కుడా భాగస్వామ్యం కావాలని సూచించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీలకు 10 అభివృద్ధి అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఏడాదిలో అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, ఆధునిక ధోబీఘాట్లు, బయో మైనింగ్‌తో డంపింగ్ యార్డు లు, మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ కేంద్రాన్ని ఏడాది కాలంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికి రూపాయికే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని, మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని, డిజిటల్ ఇంటి నంబర్ల ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పా రు. గ్రీన్ బడ్జెట్‌తో గ్రీనరీ పెంపొందించుకోవాలన్నారు. 10 అభివృద్ధి అంశాలను ప్రతి మున్సిపాలిటీ ఏడాది కాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించే పట్టణ, పల్లె ప్రగ తి కార్యక్రమాల్లో పక్కా ప్రణాళికల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజ య్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయ క్, రెడ్యానాయక్, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమా ర్, గండ్ర జ్యోతి, కుసుమ జగదీశ్, సంపత్‌రెడ్డి, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ గోపి, కమిషనర్ ప్రావీణ్య, మున్సిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.