నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 20 ; పంట చేతికొచ్చిన వేళ అకాల వర్షం రైతన్నను ఆగం చేసింది. వర్షానికి వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం ఉదయం ఉరుములు, గాలివానతో మొదలు కాగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జనగామ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపించగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వాన పడింది. కోత దశలో ఉన్న వరితో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లు ఆలస్యమై చాలాచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మిగతా చోట్ల చిరుజల్లులు పడగా ధాన్యాన్ని కాపాడేందుకు టార్పాలిన్లు, పరదాలు కప్పుతూ అన్నదాతలు నానాపాట్లు పడాల్సి వచ్చింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో నిన్నటివరకు ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలిగింది.
అకాల వర్షం జనగామ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. కోత దశలో ఉన్న వరి పంటలకు నష్టం వాటిల్లింది. జనగామ రూరల్ మండలం, లింగాలఘనపురం, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల్లో మోస్తరు వాన కురవగా నర్మెటలో భారీ వర్షం కురిసింది. మామిడి కాయలు రాలి, కూరగాయలు, పండ్ల తోటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లింగాలఘనపురం మండలం నేలపోగులలో తాటిచెట్టుపై పిడుగు పడింది. జనగామ వ్యవసాయ మార్కెట్, చీటకోడూరు రోడ్డులోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, బచ్చన్నపేట మండలంలోని కేంద్రాల్లోని ధాన్యం పాక్షికంగా తడిసింది.
హనుమకొండ జిల్లాలో మోస్తరు వాన కురిసింది. ఎల్కతుర్తి, ధర్మసాగర్, కమలాపూర్, ఐనవోలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. అధికారులు కొనుగోళ్లు జాప్యం చేస్తుండడంతో ఎల్కతుర్తి మార్కెట్ యార్డు లో ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పినా వరద నీరు చేరి వడ్లు తడిసిపోయాయి. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో వరి నేలవాలి గింజలు రాలిపోయాయి. ధర్మసాగర్‌లోని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేక ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపూర్ మండలకేంద్రంతో పాటు గూడూ రు, ఉప్పల్, అంబాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడుస్తుండడంతో రైతులు కవర్లు కప్పుకున్నారు. ఐనవోలు మండలంలోనూ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. వెంటనే కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.