మహదేవపూర్, జూన్ 17 : కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు, బాలాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ మహేశ్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి స్వామికి పూలు, పండ్లు సమర్పించారు. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో వచ్చిన శిష్యబృందం, తొమ్మిది మంది వేద పండితుల ఆధ్వర్యంలో మహా గణపతి పూజ అనంతరం ప్రత్యేక యాగశాలలో పంచబ్రహ్మ హోమం, శాంతి పూజ, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు.
అనంతరం స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. ప్రధాన అర్చకుడు నగేశ్‌శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ కళశాలను ఊరేగించి, బాలాలయ మండపంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, శ్యామ్‌సుందర్, సీతారాం, దుర్గయ్య, అశోక్, పద్మ, రాజయ్య, ప్రశాంత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, సత్యంతో పాటు శృంగేరి పీఠం శిష్య బృందాన్ని సన్మానించారు.