మహబూబాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/ మహబూబాబాద్ రూరల్ : మానుకోటను పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించాల్సి ఉండగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎస్సీ అనుమతి ఇవ్వకపోయినా రైతులే స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని శాంతియుతంగా చేస్తారని పిలుపుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. జిల్లాకేంద్రానికి ఇతర మండలాల నుంచి రాకుండా భారీకేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో అడుగడుగునా పోలీసుల కవాతుతో జనం బెంబేలెత్తిపోయారు.
అసలు జిల్లాలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారు పడ్డారు. స్వయంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు బలగాల కవాతులో పాల్గొన్నారు. గురువారం మానుకోట పట్టణంలో నిర్వహించే గిరిజన రైతు మహాధర్నాకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. చివరి నిమిషంలో పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించడమే గాక గురువారం జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.
దీంతో అర్ధరాత్రి నుంచే మహబూబాబాద్ పట్టణమంతా పోలీసులు నిర్బంధంలోకి వెళ్లిపోయింది. నలుగురికి మించి గుమికూడవద్దని అలాగే మండలాల నుంచి జిల్లాకేంద్రానికి వచ్చే దారుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇద్దరు ముగ్గురికి మించి ఎకువ సంఖ్యలో జిల్లా కేంద్రానికి వస్తే వారి వివరాలు అడిగి తెలుసుకుని పట్టణం లోపలికి అనుమతించారు. తహసీల్దార్ సెంటర్, మదర్ థెరిస్సా సెంటర్, వైఎస్సార్ సెంటర్, నర్సంపేట రోడ్డు, స్వామి వివేకానంద సెంటర్లలో పోలీసు కవాతు నిర్వహించారు. అయితే పట్టణంలోని ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున ఖాకీలు మోహరించడంతో ప్రజలు భీతిల్లిపోయారు. ప్రజలు తప్పనిసరి పని అయితేనే బయటకు రావాలని, రోడ్ల మీద ఎక్కువ సేపు ఉండొద్దని ఆటోలో మైకు ద్వారా పోలీసులు హెచ్చరికలు చేశారు. దీంతో బయటికెళ్దాం అనుకున్న ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు.
లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లాకు చెందిన గిరిజన సంఘాలు, ప్రజలు, పార్టీలకతీతంగా గిరిజన నాయకులు సహకరించాలి. గిరిజన మహాధర్నాకు అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి. రాజ్యాంగంలో ధర్నా చేసే హకు ప్రతిపక్ష పార్టీలకు లేదా. త్వరలో జరగబోయే గిరిజన ధర్నాకు గిరిజన ప్రజాప్రతినిధులు తరలివచ్చి సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాలి.
– మాలోత్ కవిత, పార్టీ జిల్లా అధ్యక్షురాలు
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోటను జిల్లాగా చేశాం. సమీకృత కలెక్టరేట్, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు నిర్మించాం. ప్రభుత్వ దవాఖానలను బాగుచేశాం. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలి. గిరిజన రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం.
– డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మానుకోట అభివృద్ధికి తగ్గడం మట్టి పోయలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లను తరిమికొట్టినట్లు, త్వరలోనే కాంగ్రెస్ వాళ్లను తరిమికొట్టే రోజులు వస్తాయి.
– బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే