కేయూ వేదికగా క్రీడా పండుగ మొదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వందలాది క్రీడాకారులతో గురువారం సౌత్‌జోన్ ఖోఖో(మహళ) టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల వర్సిటీల నుంచి 67 జట్లు తరలిరాగా, తొలిరోజు పోటీలు హోరీహోరీగా సాగాయి. ఎండను సైతం లెక్కచేయక కోర్టులో దిగిన ఆటగాళ్లు ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లారు. తొలిరోజు రాష్ట్రం నుంచి పాల్గొన్న కేయూ(వరంగల్), ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్), తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్) జట్లు సత్తా చాటగా, పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్‌నగర్), మహాత్మాగాంధీ యూనివర్సిటీ(నల్గొండ) జట్లు ప్రతిభ చాటాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేయూ వీసీ రమేశ్, వరంగల్ సీపీ తరుణ్‌జోషి క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని సమన్వయంతో విజయం సాధించాలని సూచించారు.
నయీంనగర్, మార్చి 17 : కేయూలో ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వరకు జరిగి టోర్నీ కొనసాగనుండగా, క్రీడా కార్యదర్శి టి సవితా జ్యోత్స్న, వరంగల్ సీపీ తరుణజోషితో కలిసి కేయూ వీసీ తాటికొండ రమేశ్ క్రీడా జెండాను ఎగురవేసి ఆరంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. 67 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు నుంచి 1000మంది క్రీడాకారులు, రెఫరీలు, కోచ్‌లు, మేనేజర్లు ఉంటారని తెలిపారు. క్రీడలతో టీం వర్, స్నేహం, నెట్ వరింగ్ అబివృద్ధి చెందుతుందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ లు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయంతోనే విజయం సాధ్యమని సీపీ తరుణ్‌జోషి అన్నారు. ఖోఖో సంప్రదాయ గ్రామీణ క్రీడ అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
మొదటి రోజు పోటీలు నువ్వానేనా అన్నట్లు సాగాయి. ఎండను సైతం లెక్కచేయక క్రీడాకారులు బరిలో దిగి సత్తాచాటారు. తొలిరోజు 40 జట్లు పోటీలో పాల్గొనగా ఇరవై జట్లు తమ ప్రతిభతో సత్తాచాటాయి. 20న ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ క్రీడా కార్యదర్శి సవితా జ్యోత్స్న తెలిపారు. మొదట యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీతో తలపడగా మద్రాస్ జట్టు 11-8 సోర్ సాధించింది. కువెంపు యూనివర్సిటీ, కర్ణాటక-శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతితో తలపడగా-కర్ణాటక 10-7 సోర్ సాధించింది. మధురై కామరాజు యూనివర్సిటీ, మధురై-డాక్టర్ బి ఆర్ అంబేదర్, శ్రీకాకుళం తలపడగా మధురై 20-5 సోర్ చేసింది. అలాగే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్-అరుణాచలం ఇన్స్టిట్యూట్, కోయంబత్తూరుతో తలపడగా తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ 17-16 సోర్ సాధించింది. కన్నూరు యూనివర్సిటీ, కన్నూరు-బెంగళూరు యూనివర్సిటీ, బెంగళూరుతో తలపడగా కన్నూరు 11-10 సోర్ చేసింది. ఎంజీ యూనివర్సిటీ, కొట్టాయం-అన్నా యూనివర్సిటీ, చెన్నై తలపడగా కొట్టాయం 18-6 సోర్ సాధించింది.
భారతియర్ యూనివర్సిటీ, తమిళనాడు-కర్ణాటక స్టేట్ యూనివర్సిటీ తలపడగా తమిళనాడు 11-7 సోర్ చేసింది. అన్నామలై యూనివర్సిటీ, చిదంబరం-కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం, విజయవాడ తలపడగా చిదంబరం జట్టు 22-6 సోర్ చేసింది. మంగళూరు యూనివర్సిటీ-ఎంజీఆర్ యూనివర్సిటీ, చెన్నైతో తలపడగా మంగళూరు 26-1 సోర్ చేసింది. దేవనగరి యూనివర్సిటీ, కర్ణాటక-మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండతో తలపడగా దావన్గరి 8-6 సోర్ సాధించింది. వీటీ యూనివర్సిటీ, బెల్గావి-పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతితో తలపడగా వీటీ యూనివర్సిటీ 9-1 సోర్ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి-పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌తో తలపడగా-రాజమండ్రి 11-10 సోర్ సాధించింది. ఎంఎస్ యూనివర్సిటీ- తిరునల్వేలి, బెంగళూరు సిటీ యూనివర్సిటీతో తలపడగా ఎంఎస్ యూనివర్సిటీ, తిరునల్వెలి 10-7 సోర్ చేసింది.
తుంకూర్ యూనివర్సిటీ, తుంకూర్, రాయలసీమ వర్సిటీతో తలపడగా తుంకూర్ 20-6 సోర్ సాధించింది. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్-క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరుతో తలపడగా హైదరాబాద్ 11-6 సోర్ సాధించింది. అలాగే శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్-కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ తలపడగా కేయూ 18-2 స్కోర్ చేసింది. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ జట్టు క్రీడాకారులను సవితాజ్యోత్స్సతో పాటు కోచ్‌లు, ఇతర అధికారులు అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఫైనల్స్‌లోనూ సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి వెంకట్రామరెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ బి సురేశ్, రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ బాధ్యులు రామకృష్ణ, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.