హనుమకొండ, సెప్టెంబర్ 23 : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదారణకు గురైన తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు మహర్దశ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సర్కారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో తెలంగాణలోని పర్యాటకులే కాకుండా ఇతర రాష్ర్టాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మొదట భద్రకాళి చెరువులో ఈ నెల 27న పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ బోటును ప్రారంభించనున్నారు. ఇందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కొనుగోలు చేసిన బోటు ఇప్పటికే నగరానికి చేరింది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల, లక్నవరం, రామప్ప లాంటి ప్రాంతాలకే పరిమితమైన బోటు షికారు త్వరలోనే నగర వాసులను చేయనున్నారు. భద్రకాళి, వడ్డేపల్లి బండ్ వినియోగంలోకి రావడంతో ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే మరిం త మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వం బోటింగ్ ఏర్పాటు చేయాలని నిర్వహణ బాధ్యతలను టూరిజం శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నగర వాసులు, పర్యాటకులు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. బోటులో షికారు చేసేందుకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30గా నిర్ణయించినట్లు టూరి జం శాఖ అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 సీట్ల కెపాసిటీ ఉన్న బోటును రూ. 40 లక్షల వ్యయంతో పుణెలో తయారు చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరమే అనుమతి ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన భద్రకాళి చెరువులో ముందుగా బోటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ 30 సీట్ల కెపాసిటీ ఉన్న బోటును రూ. 40లక్షలతో కొనుగోలు చేసింది. బోటు ఇప్పటికే నగరానికి చేరుకున్నది. త్వరలోనే వడ్డేపల్లిలో కూడా బోటింగ్ సౌకర్యం కల్పిస్తాం. అలాగే నగరానికి పెడల్, స్పీడు బోట్లు సైతం త్వరలో రానున్నాయి.
– ఎం శివాజీ, టూరిజం శాఖ జిల్లా అధికారి, హనుమకొండ