ఖిలావరంగల్, మే 9: రేషన్ బియ్యం పంపిణీలో కొంతమంది డీలర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కాంటాపై గన్నీ సంచులతోపాటు బియ్యం పోసి లబ్ధిదారులకు మూడు కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయ్ అధికారులు వదిలేస్తుండడంతో స్టేట్ సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి కొరఢా ఝళిపిస్తున్నారు.
శుక్రవారం స్టేట్ సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జాటోత్ వసంత్‌కుమార్, గుండ్రపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒకేరోజు వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో నాలుగు చోట్ల దాడులు చేసి భారీగా సన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశాయిపేటలో లెంకలపల్లి శ్రీనివాస్ 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వ్యాన్‌లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హనుమకొండ బొక్కలగడ్డలో టీ సుభద్రకు చెందిన రేషన్ షాపులో 150 క్వింటాళ్ల బియ్యాన్ని గన్నీ బ్యాగ్‌ల నుంచి తెల్ల సంచుల్లో నింపి టాటాఏస్ వాహనంలో లోడ్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా సీజ్ చేశారు. వ్యాపారులు లెంకలపల్లి శ్రీనివాస్, డ్రైవర్ కుంభోజి నరేశ్, బొక్కలగడ్డకు చెందిన చిన్నాల సంపత్, నయీంనగర్‌కు చెందిన కనపర్తి కోటేశ్వర్రావుతోపాటు షాపు నంబర్-32 నిర్వాహకురాలు సుభద్ర, సదానందంపై కేసులు నమోదు చేసి షాపును సీజ్ చేశారు.
జిల్లాలో సివిల్ సప్లయ్, లీగల్ మెట్రాలజీ అధికారులు నామమాత్రంగా తనిఖీ చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లోని కొన్ని రేషన్ షాపుల్లో డీలర్లు కాంటా కొడుతున్నా, బియ్యం దందా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో స్టేట్ సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్, వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడుల్లోనే బియ్యం నిల్వలు బయటపడుతున్నాయని, అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారని, ఫలితంగా పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నట్లు స్థానికులు ఆరోస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.