పాలకుర్తి డిసెంబర్ 28 : తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలమైన పాలకుర్తిలోని సోమనాథ కళా పీఠం సాహిత్య, సాంస్కృతిక వేదిక 2021-22 పురస్కారాలను ఈ నెల 31న మండల కేంద్రంలో సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రదానం చేస్తామని కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. సోమనాథ కళాపీఠం పురస్కారాల గ్రహీతల ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. సోమనాథ సాహిత్య పురస్కారానికి డాక్టర్ కానుకుర్తి శెట్టి సోమశేఖర్, సోమనాథ సామాజిక శోధన పురస్కారానికి డాక్టర్ నలిమెల భాస్కర్, సోమనాథ రంగస్థల పురస్కారానికి మంచాల రమేశ్, పందిళ్ల శేఖర్‌బాబు, రాజయ్యశాస్త్రి, స్వచ్ఛంద భాషా సేవ పురస్కారానికి డాక్టర్ మైథిలి అబ్బరాజు, వీరమనేని చలపతిరావు, సాహిత్య పురస్కారానికి ఎంఎస్ ఆర్ వెంకటరమణ, ముశం దామోదర్‌రావు, ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారానికి డాక్టర్ సీఎస్ ఆర్ ప్రభు, డాక్టర్ రాపోలు సోమయ్య, ప్రతిభా పురస్కారానికి డాక్టర్ అరూరి మహేందర్, దేవగిరి రాజయ్య, స్మారక బిరుదుకు బూస రేణుకారాధ్య ఎంపికైనట్లు తెలిపారు. సమన్వయ కర్తలుగా రాపోలు ఆనందభాస్కర్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ టీ శ్రీరంగస్వామి, మార్గం లక్ష్మీనారాయణతో కూడిన నిర్ణాయక మండలి ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేసింది.