భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 25: డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిపై పోడుదారులు దాడి చేశారు. దీంతో అటవీ శాఖాధికారులు వారిపై కేసు నమోదు చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీశాఖాధికారి వసంత వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి, గణపురం మం డలం చెల్పూరు శివారు మధ్య అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కొందరు పెద్దఎత్తున పోడు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో భూపాలపల్లి రేంజ్ అధికారి నరేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పోడుదారులను అడ్డుకున్నారు.
ఒకసారిగా డోజర్లను అటవీశాఖ సిబ్బందిపైకి ఎక్కించి చంపాలనే ప్రయత్నం చేయడంతో వారు తప్పించుకున్నారు. వెంటనే పోడుదారులు కర్రలతో అటవీశాఖ సిబ్బందిపై దాడికి దిగడంతో చెల్పూరు బేస్ క్యాంపు సిబ్బంది జే సురేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోడుదారులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఘటనా స్థలంలో పోడుదారులు వదిలి పెట్టిన మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా అడవిని నరికి పోడు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో హెచ్చరించారు.