వరంగల్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక వసతులతో స్మార్ట్ బస్‌స్టేషన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రూ. 75 కోట్ల అంచనాతో 2.32 ఎకరాల విస్తీర్ణంలో 32 ప్లాట్ఫారాలతో టీఎస్ ఆర్టీసీ స్మార్ట్ బస్‌స్టేషన్‌ను నిర్మించనుంది. హైదరాబాద్ బస్ భవన్లో గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక వసతులతో నిర్మించే బస్‌స్టేషన్‌పై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ స్మార్ట్ బస్ స్టేషన్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిన ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. రోజురోజుకు విస్తరిస్తున్న వరంగల్ మహానగరానికి ఆధునిక వసతులతో బస్‌స్టేషన్ నిర్మించనున్నారు. జీ ప్లస్ 5 ఫ్లోర్లతో నిర్మించే బస్ స్టేషన్లో 32 ప్లాట్‌ఫారాలు ఉండనున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్ వసతి కల్పించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అన్ని హంగులతో వరంగల్ మహా నగరంలో బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్‌లో ఉన్న బస్‌స్టేషన్‌ను పూర్తిగా తొలగించి అదేస్థానంలో స్మార్ట్ బస్‌స్టేషన్ నిర్మించనున్నారు. ఇప్పటికే రైల్వే అధికారులతో టీఎస్ ఆర్టీసీ అధికారులు జరిపిన సంప్రదింపులపై సమావేశంలో చర్చించారు.
నియో మెట్రోకు అనుసంధానం
కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నిర్మించనున్న నియో మెట్రోకు గ్రేటర్ వరంగల్ నగరంలో నిర్మించే బస్‌స్టేషన్‌ను అనుసంధానం చేయనున్నారు. స్కై వేలను నిర్మించి నియో మెట్రోకు కలుపనున్నారు. కుడా ఆధ్వర్యంలో వరంగల్ మహా నగరంలో నియో మెట్రో నిర్మాణం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆధునిక హంగులతో నిర్మించే బస్ స్టేషన్‌ను స్కైవే ద్వారా అనుసంధానం చేయనున్నారు.
నాగ్‌పూర్ మెట్రోతో చర్చలు
వరంగల్ మహా నగరంలోని స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణంపై యూఎంటీసీ అండ్ నాగ్‌పూర్ మెట్రో సంస్థలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక హంగులతో బస్ స్టేషన్ నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో ఈడీఈ వినోద్‌కుమార్, ఈడీవో మునిశేఖర్, సీఈ రాంప్రసాద్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, టీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.