హనుమకొండ చౌరస్తా, జూలై 13 : వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులూడి కుప్పకూలింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో గదిలో విద్యార్థినులు లేకపోవడంతో వారి ప్రాణాలకు ముప్పువాటిల్లలేదు. దీంతో విద్యార్థినులు పోతన హాస్టల్ ఎదుట రాత్రి నుంచే నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. పెచ్చులూడిన సమయానికి ఎవ్వరూ లేకపోవడం తమ అదృష్టమని, లే కుంటే ప్రాణహానీ జరిగేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై యూనివర్సిటీ అధికారులను నిలదీశారు. శనివారం ఉదయం కూడా వారు హాస్టల్లోకి వెళ్లకుండా భ యాందోళనలతో ఆరు బయటనే కూర్చున్నారు.
రిజిస్ట్రార్‌ను బంధించేందుకు యత్నం..
హాస్టల్లో నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పరిష్కరించడంలేదని విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిపై మండిపడ్డారు. రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో మల్లారెడ్డిని బంధించేందుకు యత్నించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రాణిరుద్రమదేవి హాస్టల్‌ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో హాస్టల్‌కు వచ్చిన రిజిస్ట్రార్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. శనివారం తెల్లవారుజాము వరకు విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మల్లారెడ్డిని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ సమస్యలపై నిలదీశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇదే పోతన హాస్టల్లో కొద్దిరోజుల క్రితం సీలింగ్ ఫ్యాన్ కిందపడడంతో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సమ్మక్క-సారలమ్మ హాస్టల్ కేటాయింపు
పోతన గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు నూతనంగా నిర్మించిన సమ్మక్క-సారలమ్మ హాస్టల్‌ను కేటాయించారు. కొత్తగా 200 బెడ్స్ ఆర్డర్ ఇచ్చామని, అవి వచ్చిన తర్వాత షిఫ్ట్ చేద్దామనుకున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు. దీంతో పాత బెడ్స్‌తోనే విద్యార్థినులను నూతన హాస్టల్లోకి మారుస్తున్నట్లు పేర్కొన్నారు.