కురవి (సీరోలు), జూన్ 16: సీరోలు మండలంలోని బూర్గుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని పీక్లా నాయక్ తండాకు చెందిన ఐదుగురి రైతుల ఆరు పశువులు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఉప్పరిగూడెం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పంట పొలాల్లో తెగి పడిన విద్యుత్ తీగలను అధికారులు తొలగించకపోవడంతో పీక్లాతండాకు చెందిన బానోతు తేజు, తేజావత్ వీరన్న, తేజావత్ వెంకన్న, తేజావత్ పద్మ, బానోత్ సేవా అనే రైతులకు చెందిన ఐదు ఆవులు, ఒక ఎద్దు విద్యుత్ షాక్తో మృతి చెందాయి.
ఇదే ఘటనలో బానోత్ ఈరాకు చెందిన మరో ఆవు తీవ్రమైన గాయాలతో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనపై ఆగ్రహానికి లోనైన రైతులు ఆందోళనకు దిగారు. 365ఎ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ డీఈ, సీరోలుపోలీసు అధికారులు, వెటర్నరీ వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. నష్టపరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రైతులు ఒక్కొక్కరికి రూ.80 వేల నుండి లక్ష వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వీస్తున్న ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలకు పంట పొలాలు, గ్రామాలలో తీగలు తెగి పడుతున్నా యి. వాటిని వెనువెంటనే మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు ఆలస్యం చేయడంతో ప్రమాదాలు పొంచి చూస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు.