సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం ములుగు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం నిషేధం విధించినా అధికారులు అమలు చేయడంలేదు. అనుకూలంగా ఉన్నాయని ప్రజలు, తక్కువ రేటుకు వస్తున్నాయని దుకాణదారులు పాలిథీన్ కవర్లను వినియోగిస్తూనే ఉన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై జిల్లా అధికార యంత్రాంగం గతంలో అవగాహన కల్పించినప్పటికీ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కిరాణా, మారెట్, మటన్, చికెన్ షాపులు, హోటళ్లు, వైన్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతోపాటు ఫంక్షన్ హాళ్లలో ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా పాలిథీన్ కవర్లు, డిస్పోజల్ గ్లాసులు, ప్లేట్లు, పేపర్లు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వీటితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ములుగు, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ కవర్ల వాడకంతో భవిష్యత్తు తరాలకు అనేక అనర్థాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు, అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూనే ఉన్నారు. కిరాణా షాపులు, మారెట్, మాంసం, చేపలు, చికెన్ షాపులు, హోటళ్లు, వైన్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతోపాటు ఫంక్షన్ హాళ్లలో ఉపయోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనైతే రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పాలిథీన్ కవర్లు, గ్లాసులు, ఇతర చెత్త గుట్టలుగా కనిపిస్తోంది.
అమలు కాని నిషేధం
మేడారం మహాజాతర-2020కు ముందు అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ప్లాస్టిక్ నిషేధంపై తగిన చర్యలు చేపట్టారు. బట్టసంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధానికి మద్దతు తెలిపి బట్టసంచులు, జూట్ బ్యాగులను వినియోగించేవారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి కారణంగా పాస్టిక్‌పై నియంత్రణ మరుగునపడిపోయింది. కూరగాయలు, ఇతర వస్తువులు తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉన్నందున కవర్లను వినియోగిస్తున్నారు. వ్యాపారులకు తక్కువ ధరకు వస్తున్నందున కవర్లలో ప్యాక్ చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ కవర్లు రోడ్లపై ఎకడ పడితే అకడే కనిపిస్తున్నాయి. డ్రైనేజీల్లో పేరుకుపోయి, మురుగునీరు ప్రవహించకుండా అడ్డుగా ఉండి దుర్వాసనకు కారణమవుతున్నాయి.
పర్యావరణానికి ఎన్నో అనర్థాలు
సింగిల్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి ఎన్నో అనర్థాలు ఉన్నాయి. క్యారీ బ్యాగుల వంటివి మట్టిలో కలిసిపోయేందుకు వంద ఏళ్లు పడుతుంది. దీంతో వర్షపు నీరు భూమి పొరల్లోకి చేరేందుకు ఆటంకం కలుగుతుంది. భూగర్భ జలాల నిల్వపై ప్రభావం చూపుతుంది. చెత్తలో పేపర్లు వంటివి తినే క్రమంలో క్యారీ బ్యాగులను కూడా తిన్న మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. డిస్పోజల్ గ్లాసుల్లో టీ, కాఫీ, పాలు తాగడం సులువుగా మారింది. అన్ని ఫంక్షన్లలోనూ డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిలో వేడి ఆహార పదార్థాలు వేయడంతో రసాయనాలు కరిగి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
ప్లాస్టిక్ క్యారీ 40 మైక్రాన్ల కంటే తకువ మందం ఉంటే పర్యావరణానికి ముప్పు అని ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై కరపత్రాలు, ఆటోలకు మైకుల ద్వారా ప్రజలను చైతన్యపరచాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదు. ఒకటి, రెండు సభలు, సమావేశాలు నిర్వహించి వేలాది రూపాయల ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఒత్తిడి పెరిగితే ఒకటి,రెండు దుకాణాల్లో నామమాత్రంగా తనిఖీలు చేసి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కొద్దిరోజులు హడావుడి చేసిన అధికారులు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధం పేరుతో దుకాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్న సిబ్బంది ఆ తర్వాత వాటిని అమ్ముకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తాం
ప్లాస్టిక్ వాడకం కొనసాగుతున్న మాట వాస్తవమే. డీఆర్డీఏ అధికారులతో కలిసి గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. గతంలో అక్కడక్కడ సదస్సులను నిర్వహించాం. ప్రజలు సైతం జూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలి. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై తగిన చర్యలు తీసుకుంటాం. క్యారీబ్యాగులు విక్రయించినా, వినియోగించినా జరిమానాలు విధిస్తాం.
– కొండా వెంకయ్య,
జిల్లా పంచాయతీ అధికారి