ములుగు, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ములు గు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వరంగల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, గోదావరి పరీవాహక ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం వరకు ఏకైక దికుగా ఉన్న ఈ ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంది. దవాఖానలో 200కు పైగా నర్సింగ్ స్టాఫ్ విధుల్లో ఉండాల్సి ఉండగా కేవలం 30 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. దీంతో సదరు సిబ్బంది తీవ్ర పని ఒత్తిడికి గురవుతుండగా, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏవైనా సమస్య తలెత్తితే సెలవు పెట్టుకొనే పరిస్థితి కూడా ఉండడం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
కొంతమంది ఉద్యోగులు పని భారం ఎక్కువై అనుమతి లేకుండా సెలవులో వెళ్తున్నారు. అత్యవసర సమయాల్లోనూ తమకున్న సెలవులు వాడుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. కొంతమంది బదిలీ అయినప్పటికీ ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక స్టాఫ్ నర్స్ రెండు నుంచి మూడు వార్డులు చూసుకోవాల్సి వస్తున్నదని, ఎమర్జెన్సీ విభాగంలో సైతం కొన్ని సందర్భాల్లో ఒకరే పనిచేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. తాత్కాలికంగానైనా, లేక పక జిల్లాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించి తమకు పనిభారం తగ్గించాలని సిబ్బంది కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రి సిబ్బంది కొరతను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.