జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ)/మొగుళ్లపల్లి, మార్చి 14 : పూడికతీతలో ఆఖరి బకెట్ ముగ్గురి ప్రాణాలు బలిగొంది. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు క్రేన్ పడిపోయి వారి కుటుంబాలను ఆగం చేసింది. మృతుల్లో వ్యవసాయ బావి యజమానితోపాటు పదో తరగతి విద్యార్థి, కూలీ ఉన్నారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొర్కిశాల గ్రామానికి చెందిన సుకినె దేవరావు, మోహన్నావు అన్నదమ్ములు. వేసవి సీజన్లో పంటలకు సాగునీటి కొరత నెలకొనడంతో వ్యవసాయ బావిలో ఇటీవల పూడికతీత పనులు చేపట్టారు. ఇవి చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పూడికతీతలో చివరి బకెట్లో పెద్ద బండతో పాటు మట్టిని నింపారు. బకెట్లో బరువు ఎక్కువై క్రేన్ అదుపుతప్పి బావిలో పడిపోయింది. దీంతో బావిలో ఉన్న సుకినె దేవరావు (48), కూలీ సరిగొమ్ముల పైడయ్య (53)తో పాటు పదో తరగతి విద్యార్థి బండారి అభిలాష్ (16) అక్కడికక్కడే మృతి చెందారు. బావి యజమాని సోదరుడు మోహన్‌రావు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం దవాఖానకు తరలించారు. మృతుల్లో సుకినె దేవారావుకు భార్య, ఇద్దరు కుమారులుండగా,. సరిగొమ్ముల పైడయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొర్కిశాల గ్రామానికి చెందిన బండారి అభిలాష్ శనివారం పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. సమీపంలోనే వ్యవసాయ బావిలో పూడికతీత పనులు జరుగుతుండగా చూసేందుకు సరదాగా వెళ్లాడు. క్రేన్‌పై కూర్చొని పూడికతీతను చూస్తున్నాడు. ఇంతలో క్రేన్ హఠాత్తుగా బావిలో పడిపోవడంతో అభిలాష్ సైతం అందులో పడిపోయి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండారి రవి, సుమలత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అభిలాష్ మృతి చెందగా చెల్లెలు , తల్లిదండ్రులు అభిలాష్ మృతదేహం వద్ద విలపించడం చూపరులను కన్నీరు పెట్టించింది. ఘటనాస్థలిని చిట్యాల సీఐ మల్లేశ్, మొగుళ్లపల్లి, గణపురం ఎస్సైలు సురేశ్, అశోక్ పరిశీలించారు. మృతదేహాలను చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా బిడ్డా.. ఫస్ట్ క్లాస్‌లో పాసయితానంటివి కదా నాయనా.. అంటూ అభిషాష్ తల్లిదండ్రులు, బంధువులు రోదించడం చూపరులను కలిచివేసింది. బావిలో క్రేన్ కూలిన ఘటనలో టెన్త్ క్లాస్ విద్యార్థి అభిలాష్ మృతి చెందడం స్థానికులను విషాదంలో ముంచింది. టెన్త్ పరీక్ష రాసి వచ్చిన అభిలాష్ సరదాగా వ్యవసాయ బావి వద్దకొచ్చి పూడిక తీతను చూసేందుకు క్రేన్‌పై కూర్చున్నాడు. క్రేన్ బకెట్ మీదకు వస్తుండడంతో కుదుపునకు గురై బావిలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రుల రోదనలతోపాటు మృతుడి చెల్లెలు అన్నకోసం కన్నీరుమున్నీరుగా విలపించింది.