వరంగల్, అక్టోబర్ 5 : దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజైన శనివారం ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు గాయత్రీ మాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహ వా హనం, సాయంత్రం మహిషాసురమర్దిని దుర్గాక్రమంలో గజ వాహనంపై ఊరేగారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్ పూజల్లో పాల్గొన్నారు.
కాళేశ్వరం : కాళేశ్వరంలోని శ్రీ శుభానంద(పార్వతి), మహా సరస్వతి అమ్మవార్లు శనివారం చంద్రఘంటా మాతగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి, లలితార్చన, పంచమి విశేష పూజలతో పాటు గణపతి, నవగ్రహ, రుద్ర పంచసూక్త, మూలమంత్ర చండీహోమం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.