లక్షల్లో పెట్టుబడి పెట్టాడు.. రాత్రీపగలు కష్టపడ్డాడు.. పంట దండిగా పండితే అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని అనుకున్నాడు.. కానీ ప్రకృతి సహకరించక మిగ్జాం తుఫాను, చీడపీడలు, వైరస్(గుబ్బ రోగం) రూపంలో పంట చేతికందక ఆదిలోనే మిర్చి రైతు ఆశలను ఆవిరి చేసింది. మార్కెట్లో ధర ఎక్కువగా ఉందని తాహతుకు మించి అప్పు చేసి పెట్టుబడి పెట్టినా నయాపైసా రాక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. చీడపీడలు సోకి మిరప కాయ ఏరే అవకాశం లేకుండా పోవడమే గాక కనీసం నాటు వేసిన కూలీలకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, మిరప పంటను దున్నేందుకు సైతం అప్పులు తేవాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
వాతావరణ మార్పులతో మిరప పంటలకు వైరస్ సోకుతున్నది. తుఫాను కారణంగా వారం రోజులుగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దీంతో మొక్కల్లో పెరుగుదల లోపించి పసుపు రంగులోకి మారడం, వైరస్ ఆశించిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లో 73,700 ఎకరాల్లో సాగు చేస్తే సుమారు 55వేల ఎకరాల్లో వైరస్ సోకి రైతులు నష్టపోయినట్లు వ్యవసాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన మిరప రైతుకు ఎకరానికి క్వింటా వచ్చే పరిస్థితి లేదు. నర్సరీలో మిరప మొక్కలు పెంచేందుకు ఒక మొక్కకు 30 పైసల చొప్పున ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశారు. దురదృష్టవశాత్తు నాటిన కొద్ది రోజులకే వైరస్(గుబ్బ)రోగం రావడంతో మొక్కలను పూర్తిగా తొలగించేందుకు దున్నేశారు. దీంతో మరోసారి మొక్కలు నాటేందుకు ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేసి.. మళ్లీ మొక్కలు కొనుగోలు చేసి నాటాలి. వాటిని దక్కించుకునేందుకు పురుగు మందులు, దుక్కి మందులు వేసినా తీరా చేతికి వచ్చే సమయంలో మళ్లీ వైరస్ సోకితే పంట పూర్తిగా నష్టపోయి ఎకరానికి రూ. లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో చేసేదేమీలేక మిరపను దున్నేస్తున్నారు. కాసిన కొద్దోగొప్పో మిరప ఏరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మా అన్నదమ్ములం ఐదు ఎకరాల్లో మిరప పంట సాగు చేసినం. మొదట్లో నాటిన సమయంలో మొక్కలకు వైరస్(గుబ్బ) రోగం వచ్చింది. మొక్కలను తీసివేయాలని వ్యవసాయ అధికారులు చెప్పడం వల్ల అన్నీ తొలగించాం. మరోసారి ఎకరానికి రూ.20 వేలు పెట్టి నర్సరీలో మొక్కలు తీసుకొచ్చి నాటినం. పైమందులు, అడుగు మందులు వేసినం. తీరా కాయ వచ్చే సమయంలో మళ్లీ గుబ్బ రోగం వచ్చి పంట మొత్తం ఎండిపోతోంది. ఐదు ఎకరాలకు రూ.5లక్షల వరకు నష్టం వచ్చింది. – ఎండీ ఖాజా మొయినుద్దీన్,
ప్రతి ఏడాది మాదిరిగానే మిరప సాగు చేసిన. వైరస్ రావడం వల్ల పంట మొత్తం పసుపు పచ్చ రంగులోకి మారి ఎండిపోయింది. నాటు వేసిన కూలీలకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. చేసేది ఏమీ లేక రెండు ఎకరాల మిరప మొత్తం దున్నేసిన. యాసంగిలోనైనా మక్కజొన్న సాగు చేసుకుందామని దుక్కి చేస్తున్న. రెండు ఎకరాల మీద సుమారు రూ. 25,000 వేల వరకు పెట్టబుడి పెట్టిన. నయాపైసా రాలేదు.
ఎంతో కష్టపడి మిరప సాగు చేస్తే పంట చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయిం ది. రాత్రనక, పగలనక కష్టపడి మిరప సాగు చేస్తే గుబ్బ రోగం వచ్చి పంట మొత్తం పాడైపోయింది. ఎకరానికి లక్ష వరకు పెట్టుబడి పెట్టిన. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం మిరుప రైతులను ఆదుకోవాలి.