జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : సర్వర్ డౌన్. ఇది భూపాలపల్లిలోని జిల్లా ప్రధాన దవాఖాన(వంద పడకల ఆసుపత్రి)లో నిత్యం వినిపించే పదం. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం వస్తుండగా ప్రతి రోజూ ఓపీ 1500 దాటుతుంది. అయితే ఓపీ మొదలు ల్యాబ్ రిపోర్టులు తీసుకొని చికిత్స చేయించుకునే దాకా అన్నీ ఆన్‌లైన్‌తో ముడిపడితో ఉంటుంది. కానీ రోగుల తాకిడికి అనుగుణంగా అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడం, సర్వర్ సమస్యల వల్ల పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్వర్‌డౌన్ కారణంగా ఓపీ, ల్యాబ్ రిజిస్ర్టేషన్, రిపోర్టులు తీసుకోవడం, చివరికి మెడిసిన్ తీసుకోవడం వరకు ప్రతీ చోట గంటల తరబడి ఎదురుచూడడం ఇక్కడ నిత్యకృత్యమైంది. దీనికి తోడు అనుభవం లేని ఆపరేటర్ల వల్ల రిజిస్ట్రేషన్ మరింత ఆలస్యమై రోగుల ఓపికకు పరీక్ష పెడుతోంది. ఆరోగ్యం బాగా లేదని దవాఖానకు వస్తే ఇక్కడే ప్రాణంపోయేలా ఉన్నదని మండిపడుతున్న తీరు అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతున్నది.
శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వర్‌డౌన్‌తో రిజిస్ర్టేషన్లు నిలిచిపోగా షుగర్ వ్యాధి పరీక్షలు చేయించుకునేవారు, ఎమర్జెన్సీ పరీక్షలు(వార్డుల్లో ఉండే వారు) చేయించుకునే వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీలు ముడుపులు తీసుకొని అర్హత లేనివారిని నియమించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు సర్వర్‌డౌన్‌తో మూడు నాలుగు రోజులకు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఉన్నతాధికారుల పర్యావేక్షణ కొరవడడంతోనే కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఆసుపత్రే జనాలకు పెద్ద దిక్కు. జిల్లాలోని మారుమూల ప్రజలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇరు రాష్ర్టాల ప్రజలకు అనువుగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రభు త్వం భూపాలపల్లిలో వంద పడకల దవాఖాన నిర్మించింది. ఇది వేలాదిమందికి సంజీవనిగా మారింది. అయితే ఇప్పుడు అధికారుల పర్యవేక్షణ లేక, ఏజెన్సీ కాంట్రాక్టర్ల చేతివాటంతో ప్రజలకు శాపంగా మారింది. జిల్లాలో 13 ఆరోగ్య కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, 65 పల్లె దవాఖానలు, 90 సబ్ సెంటర్లు, ఒక జిల్లా దవాఖాన ఉన్నాయి. అయితే అన్ని దవాఖానల నుంచి ప్రతిరోజూ మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లికి సిఫారసు చేస్తుంటారు. ఈక్రమంలో జిల్లా దవాఖానకి తాకిడి పెరుగుతుండగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు.
జిల్లా దవాఖానలో అనుభవం లేని కంప్యూటర్ ఆపరేటర్లతోనే అసలు సమస్య వస్తోంది. నియమించే ముందు వారికున్న కంప్యూటర్ పరిజ్ఞానం ఏమిటి? సర్టిఫికెట్ ఒరిజనలేనా? టైపిం గ్ స్పీడ్ ఎంత అనే కనీస అర్హతలు చూడకుండా ఏజెన్సీ కాం ట్రాక్టర్ ముడుపులు తీసుకుని నియమించడంతో ఒక్కో రిజిష్ర్టేషన్కు పావు గంట వేచి చూడాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఓపీ, ల్యాబ్ రిజిష్ర్టేషన్, ల్యాబ్ రిపోర్టులు ఇచ్చే విభాగం, మెడిసిన్ ఇచ్చే కౌంటర్ వద్ద ప్రధానంగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. వీరి పనితీరును ఉన్నతాధికారులు ఏనాడూ పర్యవేక్షించకపోవడంతో వారే పర్మినెంట్ ఉద్యోగులుగా చెలాయిస్తున్నట్లు స్పష్టమవుతోంది.